ఈనెల 22న తొలి షిఫ్ట్ నుంచే అని ప్రకటించిన ఆర్టీసీలో ఒక జేఏసీ
కార్మీకశాఖ ఉప కమిషనర్‌తో చర్చలు విఫలం..హాజరు కాని ఆర్టీసీ అధికారులు
తటస్థంగా ఆర్టీసీలోని మరో జేఏసీ, కొన్ని సంఘాలు
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో ఆర్టీసీలోని ఓ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 22న తెల్లవారుజామున తొలి షిఫ్ట్ నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఆర్టీసీలోని మరో జేఏసీ, కొన్ని ఇతర సంఘాలు తటస్థంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, గత ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టీసీ కార్మీక సంఘాల పునరుద్ధరణ, బకాయి ఉన్న రెండు వేతన సవరణల అమలు, అంతకుముందు వేతన సవరణ బకాయిల చెల్లింపు, ఆర్టీసీ వాడేసుకున్న ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్ నిధుల తిరిగి చెల్లింపు, ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందివ్వటం, కార్మికులపై తీవ్ర పనిఒత్తిడి ఉన్నందున వెంటనే ఖాళీలను భర్తీ చేయటం.. ఇలా మొత్తం 32 డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది. గత ఏడాది కాలంగా ఈ డిమాండ్ల సాధనకు ఒత్తిడి తెస్తున్నా ఫలితం లేదు. దీంతో సమ్మెకు సిద్ధమన్న సంకేతాలిచ్చింది.
అయినా స్పందన లేకపోవటంతో, గత నెల 13న సమ్మె నోటీసు ఇచ్చింంది. దీంతో గత నెలాఖరులో చర్చలకు రావాల్సిందిగా కార్మీక శాఖ కమిషనర్ కార్యాలయం ఆహ్వానించింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాల కారణంగా చర్చలను అర్ధంతరంగా రద్దు చేసింది. తిరిగి ఈనెల 8న మరోసారి చర్చలకు ఆహ్వానించింది. జేఏసీ నేతలు వచ్చింనా, ఆర్టీసీ అధికారులు గైర్హాజరు కావటంతో 13న మరోసారి చర్చలకు పిలిచింది. ఈసారి ఆర్టీసీ అధికారులు గైర్హాజరైతే, తాము మాత్రం సమ్మె తేదీ ప్రకటించి సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు అప్పుడే ప్రకటించారు. అనుకున్నట్టు గానే సోమవారం చర్చలకు ఆర్టీసీ అధికారులు రాలేదు. డిమాండ్లకు సంబంధించి ఐదు అంశాలు తమ పరిధిలో లేవని, అవి ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వాటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంటూ అధికారులు కార్మీక శాఖ ఉప కమిషనర్ కార్యాలయానికి ఓ లేఖ పంపారు. దీంతో చర్చలు విఫలమైనట్టుగానే జేఏసీ నేతలు పేర్కొంటూ, సంప్రదింపులకు స్వస్తి పలికామని, ఈనెల 22 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, చర్చల అనంతరం ప్రకటించారు.
కార్మీక సంఘాలే లేనప్పుడు చర్చలెవరితో...
సోమవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం వాటితో చర్చిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా, అసలు ఆర్టీసీలో కార్మీక సంఘాలే లేనప్పుడు కార్మీక నేతలతో చర్చల అంశానికి తావెక్కడిదని సమాధానమిచ్చారు.
ప్రజా ఉద్యమంగా మారుస్తాం: జేఏసీ
ఈనెల 22న తెల్లవారుజాము నుంచి సమ్మె మొదలు పెట్టాలని నిర్ణయించినందున, మంగళవారం నుంచి తాము ప్రజల్లోకి వెళ్తామని జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, వెంకన్న తెలిపారు. ఈ సమ్మెను కార్మీకుల సమ్మెగా కాకుండా ప్రజాఉద్యమంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తాము ప్రభుత్వం ముందుంచిన 32 డిమాండ్లు సహేతుకమైనవేనని, వాటిని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


