ఎన్నికల సమయంలోనే రాజకీయాలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు

Published Thu, Feb 22 2024 4:33 AM

ITIs as skill development centers with Rs 2 thousand crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాము రాజకీయాలు చేయడం లేదని, తమ దృష్టి అంతా అభివృద్ధి పైనే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఐఐ– తెలంగాణ, టీడీఎఫ్‌– యూఎస్‌ఏల ఆధ్వర్యంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, వాణిజ్య అవకాశాలు అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తరువాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో రూ. 2,000 కోట్లతో 64 ఐటీఐలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫెకెట్స్‌ ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం అందరిదని, ప్రజలు కోరుకుంటేనే అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు.

గతంలో అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్‌ కు లైఫ్‌లైన్‌ గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, సీఐఐ ప్రతినిధులు వగీశ్‌ దీక్షిత్, జి.గోపాల్‌రెడ్డి, సి. శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement