కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ అవసరం లేదన్న నాటి ప్రభుత్వ ప్రధాన అధికారి?
ధరణి లావాదేవీలపై జరగని ఆడిట్
భూభారతి లావాదేవీలదీ అదే తీరు..
విచారణ కమిటీ పరిశీలనలో వెల్లడైన కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీల విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలపై శాఖాపరంగా అంతర్గత ఆడిట్ జరగకపోగా, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఆడిట్ కూడా జరగలేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులతో పాటు రాబడుల్లో లోపాలు, ఆయా శాఖలు చేసే ఖర్చులపై ప్రతి ఏటా అధికారికంగా ఆడిట్ చేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) దృష్టికి కూడా ఈ లావాదేవీలు వెళ్లలేదని, కాగ్ ఆడిటింగ్‌కు అప్పటి ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు మోకాలడ్డారని తెలిసింది. ఈ లావాదేవీలపై ఆడిట్ అవసరం లేదంటూ ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతో రెవెన్యూ వర్గాలు కూడా కాగ్ ఆడిటింగ్‌కు సహకరించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో ఆరేళ్ల పాటు ధరణి పోర్టల్ ద్వారా జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కాగ్ ఆడిటింగ్ జరగ లేదని, అలాగే ఆ తర్వాత వచ్చిన భూభారతి లావాదేవీల ఆడిట్ కూడా జరగడం లేదని తెలిసింది.
రాజ్యాంగ ఉల్లంఘనే..!
కాగ్ ఆడిట్‌కు అధికారులు సహకరించక పోవడంపై రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ‘ఇది ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. రాజ్యాంగ ఉల్లంఘన కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సిఫారసు మేరకు చట్టసభలు కూడా జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన, భూభారతి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ రాబడుల్లో ఏవైనా లోపాలుంటే గుర్తించేందుకు ఇప్పటికైనా కాగ్ ఆడిటింగ్ అవసరం.’అని ఆయన వ్యాఖ్యానించారు.
అడ్డగోలు లావాదేవీలకు అనుమతి!
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన సందర్భంలో అప్పటి ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందడమే ధ్యేయంగా అధికారులు అడ్డగోలు లావాదేవీలకు అనుమతినిచ్చినట్టు కూడా వెల్లడవుతోంది. ఇటీవల వెలుగులోనికి వచ్చిన చలాన్ల కుంభకోణంపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణలో ఈ లావాదేవీల లోగుట్టు తెలిసింది. వ్యవసాయ భూములను డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని తేలింది. గుంట భూమిని కూడా డెవలప్‌మెంట్ రిజిస్ట్రేషన్ చేయడం, ఆ తర్వాత దాన్ని నాలా కింద మార్చుకోవడం ద్వారా చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా, ఎకరాల్లో లెక్కగట్టి చెల్లించారని, దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన మొత్తం రాలేదని వెల్లడైంది. అదే సమయంలో రాష్ట్రంలో అనధికార లేఅవుట్లను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అయిందని విచారణలో పాలుపంచుకుంటున్న ఓ అధికారి వెల్లడించారు.
ఒకే సర్వే నంబర్‌లోని భూమి వేలసార్లు రిజిస్ట్రేషన్!
రాష్ట్రంలోని ఓ సర్వే నంబర్‌కు ఏకంగా 256 బైనంబర్లు సృష్టించారని, ఈ సర్వే నంబర్‌లోని భూమిని వేలసార్లు రిజిస్ట్రేషన్ చేశారని తేలింది. రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డితో పాటు జనగామ, యాదాద్రి జిల్లాల్లో ఇలాంటి లావాదేవీలు అధికంగా తేలాయని సమాచారం. రైతుబంధు వస్తుందని, రైతు బీమా వర్తిస్తుందని బహిరంగంగానే ఫ్లెక్సీలు పెట్టి చేసిన ఇలాంటి లావాదేవీలు లక్ష దాటి ఉంటాయని కూడా ఆ అధికారి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వానికి బహుమానం పేరిట బురిడీ
గిఫ్ట్ డీడ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు తమ భూమిని ఏకంగా ప్రభుత్వానికి బహుమానంగా ఇచ్చారని కూడా కమిటీ పరిశీలనలో వెల్లడైనట్టు తెలిసింది. వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి గిఫ్ట్ ఇచ్చినట్టు స్లాట్ బుక్ చేసే వారని, తద్వారా ప్రభుత్వానికి కేవలం రూ.1000 మాత్రమే చలానా చెల్లించేవారని, డాక్యుమెంట్‌లో మాత్రం తమ కుటుంబ సభ్యులు పేర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే వారని తేలింది. కొన్ని రిజిస్ట్రేషన్లకు అక్రమార్కులు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు కింద చెల్లించినట్టుగా వెలుగు చూడటం విస్తుగొలుపుతోంది.


