స్వదేశీ ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌–1 సిద్ధం

Indigenous private rocket Vikram1 ready - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగ సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన ఏడంతస్తుల పొడవైన, బహుళ దశల లో–ఎర్త్‌ ఆర్బిట్‌ రాకెట్‌ విక్రమ్‌–1ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్‌లను ఈ రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. మంగళవారం హైదరా­బాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ రాకె­ట్‌ను ఆవిష్కరించారు. అలాగే 60 వేల చద­రపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ సంస్థ నూతన కేంద్ర కార్యాలయం ‘మ్యాక్స్‌–­క్యూ’ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జితేంద్రసింగ్‌ మాట్లాడుతూ స్కైరూ­ట్‌ ఏరోస్పేస్‌ను దేశంలోకెల్లా ఒకే గొడుగు కింద ఉన్న అతిపెద్ద ప్రైవేట్‌ రాకెట్‌ అభివృద్ధి కేంద్రంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సహ వ్యవస్థాపకుడు పవన్‌ చందన తదితరులు పాల్గొన్నారు.

2024 తొలినాళ్లలో ప్రయోగం
విక్రమ్‌–1 పూర్తిగా కార్బన్‌–ఫైబర్‌తో తయా­రైన రాకెట్‌. ఇందులో 3డీ ప్రింటెడ్‌ లిక్విడ్‌ ఇంజిన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహా­లను కక్ష్యలో ఉంచగలదు. 2024 తొలినా­ళ్లలోనే విక్రమ్‌–­1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్‌ 2022 నవంబర్‌ 18న విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ని విజయవంతంగా  ప్రయోగించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top