
కాచిగూడ–జోద్‌పూర్ రైలు సర్విసును ప్రారంభిస్తున్న అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు
కాచిగూడ–జోద్‌పూర్ రైలు ప్రారంభోత్సవంలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణలో రైల్వే మౌలిక వసతులను భారీగా విస్తరించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారీగా రైల్వే నెట్‌వర్క్ పెంచినట్లు చెప్పారు. కాచిగూడ–జో«ద్‌పూర్ డెయిలీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్విసును శనివారం కాచిగూడ స్టేషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రాజస్తాన్ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు.
హైదరాబాద్ నుంచి భోపాల్ మీదుగా జోద్‌పూర్‌కు ప్రతిరోజూ రైలు రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైలును అహ్మదాబాద్ మీదుగా నడపాలని డిమాండ్లు వస్తున్నాయని, కానీ అహ్మదాబాద్‌లో కొన్ని నిర్మాణ పనుల వల్ల ప్రస్తుతం ఆ మార్గంలో నడపడం సాధ్యం కాదని తెలిపారు. మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైల్వేస్టేషన్లను ఆధునిక హంగులతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.720 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సహా సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
శంకర్‌పల్లి టు కాజీపేట రైలు ప్రయాణం
శంకర్‌పల్లి: సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవానికి శనివారం వచ్చిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. అక్కడ నుంచి కాజీపేటకు వెళ్లేందుకు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడి నుంచి రైలులో కాజీపేటకు ప్రయాణించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తదితరులు ఉన్నారు.