టీనేజర్ల టీకాకు ఢోకా లేదు

India To Vaccinate Kids Between 15 To 18 Years From January - Sakshi

కరోనా వ్యాక్సిన్‌ ఇప్పించడంపై తల్లిదండ్రులు వెనకాడొద్దు

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వారికి టీకా అత్యంత కీలకం

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఆందోళన వద్దు.. వైద్యుల భరోస

41.60 లక్షలు 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య

22.78 లక్షలు రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయసు వారి సంఖ్య

6.34 లక్షలు ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సంఖ్య  

జనవరి 3.. దేశవ్యాప్తంగా టీనేజర్లకు టీకాలివ్వడం ప్రారంభించే తేదీ

జనవరి 10.. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చే తేదీ

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు జనవరి 3 నుంచి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఈ వయసు టీనేజర్ల సంఖ్య 22.78 లక్షలుగా ఉందని లెక్కించింది. టీకాకు అర్హుల్లో ఎక్కువ శాతం మంది టెన్త్, ఇంటర్‌ విద్యార్థులే ఉంటారని భావిస్తోంది. మరోవైపు పిల్లలకు టీకా ఇచ్చే విషయంలో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నాక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయేమోనని చాలా మంది కంగారుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోగా అక్కడక్కడా విద్యార్థులు కరోనా బారినపడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు. అలాగే జనవరి రెండో వారం నుంచి కరోనా తీవ్రత పెరుగుతుందని, ఫిబ్రవరి నాటికి తారస్థాయికి చేరుతుందని ప్రభుత్వం హెచ్చరించిందని... ఈ నేపథ్యంలో టీనేజర్లకు టీకా ఇవ్వడం అత్యంత కీలకమైనదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  

ప్రభుత్వ పరిధిలో ఉచితమే... 
టీనేజర్లకు ఇవ్వాల్సిన కరోనా టీకాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ ఉచితంగానే టీకా ఇస్తారు. అయితే ప్రైవేటులో ఇచ్చే టీకాను ప్రస్తుత ధరకే ఇస్తారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. పిల్లలకు టీకా ఇస్తున్న నేపథ్యంలో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మొదటి వారం రోజులపాటు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, తర్వాత అనుభవాలను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు తెలిపారు.

మరోవైపు 60 ఏళ్లు పైబడిన అనారోగ్య సమస్యలు ఉన్న వారితోపాటు వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ప్రివెంటబుల్‌ డోస్‌ (బూస్టర్‌ డోసు) టీకా ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయించడంతో ఆయా లబ్ధిదారుల సంఖ్య, వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

60 ఏళ్లు పైబడిన వారు 41.60 లక్షల మంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 6.34 లక్షల మంది ఉంటారని, వారిలో రెండో డోస్‌ పూర్తయిన వారికి జనవరి 10 నుంచి బూస్టర్‌ డోస్‌ ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు నూటికి నూరు శాతం మంది మొదటి డోస్‌ తీసుకున్నారు. రెండో డోస్‌ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. 

మార్గదర్శకాలపై స్పష్టత రావాలి... 
పిల్లలకు కరోనా టీకాతోపాటు పెద్దలకు ప్రివెంటబుల్‌ డోస్‌ (బూస్టర్‌)పై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటాం. ఇప్పటికైతే ప్రధాని విధాన నిర్ణయాన్నే ప్రకటించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలతో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. పిల్లలకు ఏ కంపెనీ టీకాలు వేస్తారు? ఎలా వేస్తారు? తదితర అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. 


– డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు  

15–18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయాలని కేంద్రం నిర్ణయించడం సబబే. చిన్న వయసులో పిల్లలకు ఇచ్చే ఇతర టీకాలు ఎంత సురక్షితమో కరోనా వ్యాక్సిన్‌ కూడా అంతే సురక్షితం. ప్రస్తుతం ఒమిక్రాన్‌ భయం వెంటాడుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీ పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించడానికి తల్లిదండ్రులు వెనుకాడవద్దు.
– డాక్టర్‌ ఎస్‌.కవిత, పీడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నిలోఫర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top