‘ఎక్సెల్‌ రబ్బర్‌’పై ఐటీ దాడులు

Income Tax Dept Conducted Raids On Excel Rubber Group Of Companies - Sakshi

హైదరాబాద్‌లోని 8 ప్రాంతాలతోపాటు దేశవ్యాప్తంగా సోదాలు

హార్డ్‌ డిస్క్‌లు, పలు డాక్యుమెంట్ల సీజ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సెల్‌ రబ్బర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై బుధవారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్, సంగారెడ్డి జిల్లా బొల్లారం సహా ఎనిమిది ప్రాంతాల్లో, చెన్నై, బెంగళూర్, ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి సుమారు 12 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి.

సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్‌ బ్రాంచ్‌ ఆఫీస్, కోకాపేట్‌లో ఆరుగురు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బాచుపల్లి, పాశమైలారంలోని ఎక్సెల్‌ రబ్బర్‌ యూనిట్‌ 5, విలాస్‌ పాలిమర్స్‌ ప్రైవేట్, ఎస్‌ టైర్స్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో సోదాలు చేశారు. సెర్చ్‌ వారెంట్‌తో సోదాల్లో పాల్గొన్న అధికారులు రబ్బర్‌ ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు.

ఈ కంపెనీలోకి బ్రిటన్‌ నుంచి రూ.500 కోట్ల పెట్టుబడులు రావడం, దానికి సంబంధించిన పన్నుల వివరాలను పొందుపర్చకపోవడం వంటి ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నట్లు సమాచారం. టాక్స్‌ చెల్లింపులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత ఐదేళ్లకు సంబంధించిన ఆదాయ వ్యయాలు, ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఐటీ అధికారులు పరిశీలించారు.

ఎక్సెల్‌ దాని అనుబంధ సంస్థలపై విలాస్‌ పాలిమార్‌సహా మరో రెండు కంపెనీలకు చెందిన హార్డ్‌ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్‌ చేసినట్లు తెలిసింది. సోదాలు గురువారం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐతే ఈ సోదాలకు సంబంధించిన వివరాలను ఐటీశాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top