ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత | ICET Results: TS ICET 2021 Results Were Released On Thursday | Sakshi
Sakshi News home page

ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత

Sep 24 2021 1:02 AM | Updated on Sep 24 2021 1:02 AM

ICET Results: TS ICET 2021 Results Were Released On Thursday - Sakshi

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్‌ఐసెట్‌ చైర్మన్‌ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు.

వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌.లోకేష్‌ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్‌ బి.వెంకట్రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఐఏఎస్‌ కావాలనేది లక్ష్యం..
నేను ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంగా సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్నా. టీఎస్‌ఐసెట్‌ను సివిల్స్‌ ప్రిపరేషన్‌లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్‌ ఈసీఈ పూర్తిచేశాను.     
– ఆర్‌.లోకేష్, మొదటి ర్యాంకర్‌.

బ్యాంకు మేనేజర్‌ కావాలనేది లక్ష్యం.. 
నేను బీటెక్‌ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్‌ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్‌ఐసెట్‌ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా.     
– పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్‌.

ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌లో చేరుతా..
నేను గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్‌లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరతాను.
– నవీనాక్షంత, మూడో ర్యాంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement