కల్తీపై కొరడా | Hydra, Eagle-like surveillance system for adulteration of food items | Sakshi
Sakshi News home page

కల్తీపై కొరడా

Mar 31 2026 3:48 AM | Updated on Mar 31 2026 3:48 AM

Hydra, Eagle-like surveillance system for adulteration of food items

మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీపై హైడ్రా, ఈగల్‌ తరహా నిఘా వ్యవస్థ  


వివిధ రాష్ట్రాల్లోని వ్యవస్థలను పరిశీలించి తుది నిర్ణయం 

వివిధ రూపాల్లో కల్తీ వల్ల కేన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు 

సన్న బియ్యం పంపిణీకి ఏడాది.. 

మీడియాతో సీఎం రేవంత్‌ ఇష్టాగోష్టి 

ఈ పథకం అమలు కోసం ఏటా రూ.14 వేల కోట్లకు పైగా వ్యయం 

కేంద్రం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేయాలి  

పంటల మార్పిడిపై శాస్త్రవేత్తలు, మేధావులతో టాస్‌్కఫోర్స్‌ 

50% సీట్ల పెంపు ప్రాతిపదికతో పునర్విభజన చేస్తే దక్షిణాదికి అన్యాయం 

అన్యాయం సరిదిద్దకపోతే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటం 

కేసీఆర్‌ లేకపోతే నేను చేసిన మంచి పనులు తెలిసేవి కావన్న ముఖ్యమంత్రి

రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని వ్యాఖ్య 

నేటి నుంచి కేరళలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీపై హైడ్రా, ఈగల్‌ తరహా పకడ్బందీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థలను, చట్టాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆహారంతో పాటు వివిధ రూపాల్లో కల్తీ వల్ల కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కేన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్‌ హాలులో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

వ్యవసాయం, పౌష్టికాహారంపై కమిటీ.. 
‘ఆహార భద్రత కల్పనలో భాగంగా అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. నాణ్యమైన ఆహారంతోనే బాధ్యత తీరిపోయిందనుకోకుండా..వ్యవసాయం, పౌరసరఫరాలు, సంబంధిత ఇతర శాఖలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు ఏం చేయాలి అని దానిపై చర్యలు తీసుకుంటాం. విద్యలో నాణ్యత, సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం మా ప్రభుత్వ తదుపరి లక్ష్యం.  

అలాగైతే మోదీ ఫొటో పెడతాం.. 
సన్న బియ్యం పథకం అమలు కోసం ఏడాదికి రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలోని 86 శాతం మందికి అంటే.. 3.39 కోట్ల మందికి (గతంలోని 2.80 కోట్ల మంది నుంచి 3.39 కోట్లకు పెరుగుదల) సన్న బియ్యం పథకం అందుతోంది. రేషన్‌కార్డుల పంపిణీ కూడా సంతృప్త స్థాయి (సాచురేషన్‌ లెవల్‌)లో వందశాతం పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వంద శాతం సన్న బియ్యం ఇస్తే ప్రధాని మోదీ ఫొటో పెడతాం. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేపడితే బాగుంటుందని కేంద్రానికి సూచిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.   

పంటల మార్పిడి జరగాలి 
‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాభసాటి పంట వరి ఒక్కటే కాదన్న విషయాన్ని రైతులు గ్రహించాలి. రాష్ట్ర భూమి, నైసర్గిక స్వరూపం, తదితరాలకు అనుగుణంగా పంటల మార్పిడి జరగాలి. ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ విషయంలో రైతుల్ని ఒత్తిడి చేయం. వారికి తగిన అవగాహన కల్పిస్తాం. వరి వేస్తే ఉరేనంటూ గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ బెదిరించారు. ఈ విషయంలో ఆయనకు, నాకు ఎలాంటి పోలిక లేదు. మేము బోనస్‌ కూడా ఇస్తున్నాం. పంటల మార్పిడిపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు, మేధావులతో టాస్‌్కఫోర్స్‌ కమిటీ వేస్తాం. వారిచ్చే నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రవాణా, కోల్డ్‌ స్టోరేజీలు, నిల్వ చేసే వ్యవస్థ తదితరాలపైనా సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏదైనా పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ నిధి ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు.   

బ్రూటల్‌ మెజారిటీతో నియంతృత్వం 
‘నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల పెంపు ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. దక్షిణాదిలో ఒక్క సీటు కూడా గెలవకుండానే ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ఈ విధంగా లభించే ‘బ్రూటల్‌ మెజారిటీ’ నియంత పాలనకు, నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయకూడదు. ఉత్తరాది రాష్ట్రాలకు మరి ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలకు, దక్షిణాది రాష్టాలకు మధ్య ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్యలో తేడా ఎంత ఉందో అంత స్థాయిలోనే సీట్లు పెంచాక కూడా తేడా ఉండేలా చూడాలి. దీనిపై ఇప్పటికే కేంద్రానికి నిరసన తెలిపాం.  

లక్ష్మణ్‌ రాజీనామా చేయాలి 
దక్షిణాదికి జరిగే అన్యాయం సరిదిద్దకపోతే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ఉమ్మడిగా పోరాడుతాం. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఏవేవో లెక్కలు చెబుతున్నారు. దక్షిణ భారత ప్రజల కోసం ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. ఉత్తరం, దక్షిణం మధ్య అంతరం పెరగకుండా చూడాలి..’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నుంచి రెండురోజుల పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలిపారు.  

శకుని వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది 
‘మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. కేసీఆర్‌ ఉండటం వల్లే రేవంత్‌రెడ్డికి పేరు, గుర్తింపు వచ్చింది. ఆయన లేకపోతే నేను చేసిన మంచి పనులు తెలిసేవి కావు. సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇలా అన్నీ చేస్తున్నాం. మరి కేసీఆర్‌ చెప్పినవి చేశారా? డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇచ్చారా? మేము చేసేదే చెబుతున్నాం. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. శకుని చేసిన పనుల వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వాళ్లు చెబుతున్నారు. కానీ కేసీఆర్‌ను బావా, బావమరుదులు కలిసి (హరీశ్, కేటీఆర్‌) గృహ నిర్బంధంలో ఉంచారేమోనన్నది నా అనుమానం..’ అని సీఎం వ్యాఖ్యానించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement