వరుస సెలవులు.. ఎంచక్కా చెక్కేద్దాం

Hyderabad Weekend Getaways: Hill Stations, Resorts, Villas - Sakshi

లాంగ్‌ వీకెండ్స్‌ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనుల ప్లాన్ 

రెండు వీకెండ్‌లలో మూడేసి రోజులు సెలవులు

హాలిడే స్పాట్‌లు, హిల్‌స్టేషన్లలో బుకింగ్స్‌ ఫుల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా గడిచిన ఏడాదంతా దాదాపు ఇళ్లకే పరిమితమైన హైదరాబాద్‌ నగర పౌరులు ప్రస్తుత రిలాక్స్‌ అయ్యేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కనీసం రెండు, మూడు రోజుల పాటైనా బిజీ, రొటీన్‌లైఫ్‌కు, నగర రణగొణ ధ్వనులకు దూరంగా గడపాలని గట్టిగా కోరుకుంటున్నారు. వరుసగా రెండు వారాంతాల్లో మూడేసి రోజులు సెలవులు రావడంతో ‘మినీ వెకేషన్‌’ప్లాన్‌ చేసుకున్నారు. 29న (సోమవారం) హోలీ ఉండటంతో ఈ వీకెండ్‌లో వరుస మూడురోజులు సెలవులు వచ్చాయి. అలాగే వచ్చే వీకెండ్‌లో కూడా... ఏప్రిల్‌ 2న గుడ్‌ ఫ్రైడే, 3న శనివారం, 4న ఆదివారం (ఈస్టర్‌) ఇలా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో పట్టణాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో సేదదీరేందుకు సిద్ధమయ్యారు.

వేసవి కావడంతో హిల్‌స్టేషన్లు, చెట్లు చేమలతో పచ్చటి వాతావరణం ఉన్న ప్రదేశాలకు చెక్కేస్తున్నారు. తాముంటున్న పట్టణాలు, నగరాల నుంచి సుదూర ప్రాంతాలకు కాకుండా తమ సొంత వాహనాల్లో వెళ్లి మూడు రోజుల గడిపేలా సమీపంలోని అహ్లాదకరమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం దేశంలోని పట్టణ ప్రజలు తమకు దగ్గరలోని విల్లాలు, రిసార్ట్‌లు, హాలిడే స్పాట్‌లు, హిల్‌స్టేషన్లు, తదితరాలను ముందుగానే బుక్‌ చేసుకున్నట్టుగా వివిధ రిసార్ట్స్, హాలిడే నిర్వహణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా తీసుకుంటే ప్రస్తుత ‘హోలీ, గుడ్‌ ఫ్రైడే వీకెండ్స్‌’లోనే అత్యధిక హాలిడే బుకింగ్‌లు వచ్చినట్లు వెల్లడించారు.

 

ఎక్కడెక్కడికి వెళుతున్నారంటే... 

► నైనిటాల్, మనాలీ, గ్యాంగ్‌టక్, డార్జిలింగ్, లోనావాలా, రిషికేష్‌ వంటి హిల్‌స్టేషన్లను అత్యధికులు బుక్‌ చేసుకున్నట్టుగా మేక్‌ మై ట్రిప్‌ ప్రతినిధి తెలిపారు. 
     

► మినీ వెకేషన్ల సందర్భంగా కరోనా వైరస్‌ బారినపడకుండా ఎక్కువగా రద్దీ లేని ప్రాంతాలు, హిల్‌స్టేషన్లు, పరిమితంగా అతిధులకు ఆతిధ్యమిచ్చే పర్యాటక కేంద్రాలను ఎంచుకున్నట్టు ఈ సంస్థ   వెల్లడించింది. 

► లగ్జరీల కోసం కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడే వారు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అకామిడేషన్స్, విల్లాలను ఎంచుకుంటున్నారు. 
     

► ముందస్తుగా హాలిడే బుకింగ్‌ కోసం ఎంక్వైవరీ చేసే వారి సంఖ్య 50 శాతం పెరిగినట్టు యాత్ర డాట్‌ కామ్‌ తెలిపింది.  
     

► గోవా, జైపూర్, పాండిచ్చేరి, షిమ్లా, నైనిటాల్, అమృత్‌సర్‌ వంటి ప్రాంతాల్లోని హాలిడే స్పాట్‌లలో గడిపేందుకు ఉత్సుకత ప్రదర్శించినట్టు యాత్రా.కామ్‌ ప్రతినిధి శ్వేతా సింఘాల్‌ తెలిపారు. 

► మహాబలేశ్వరం, కార్బేట్, ముస్సోరీ, కందాఘాట్, నాల్‌డెహ్రా, గోవా వంటి ప్రాం తాల్లోని రిసార్ట్‌లలో దాదాపు వందశాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ చీఫ్‌ వర్కింగ్‌ ఆఫీసర్‌ వివేక్‌ ఖన్నా వివరించారు. 
     

► స్విమ్మింగ్‌ పూల్స్, ఇతర అత్యాధునిక సదుపాయాలు, వసతులున్న పర్సనల్‌ విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగినట్టు థామస్‌ కుక్‌ (ఇండియా) లిమిటెడ్‌ అధ్యక్షుడు రాజీవ్‌ కాలే తెలిపారు.  
     

► కొందరు మాత్రం ఈ మినీ వెకేషన్‌ కోసం మరీ సుదీర్ఘ ఫ్లైట్‌ టైమ్‌ కాకుండా తక్కువ సమయంలో విమానంలో వెళ్లగలిగే అండమాన్‌ నికోబార్, శ్రీనగర్‌ వంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నట్టు మేక్‌ మై ట్రిప్‌ వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top