ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా.. కచ్చితంగా దొరికిపోతారు..

Hyderabad: Vigilance Teams in Traffic Wing to Control Violations - Sakshi

ట్రాఫిక్‌ వింగ్‌లో విజిలెన్స్‌ టీమ్స్‌

కీలక జంక్షన్ల వద్ద మాటు వేసి ఉండేందుకే

కెమెరాలకు చిక్కని ఉల్లంఘనలపై నజర్‌

అనుసరించి పట్టుకోవడానికి సమాయత్తం

జోన్‌కు రెండేసి ఏర్పాటు చేయాలని నిర్ణయం

త్వరలో విధులు ప్రారంభించనున్న బృందాలు 

సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం సైరన్లు పోలీసు, అగ్నిమాపక శాఖ తప్ప మరెవరూ వినియోగించకూడదు. ప్రస్తుతం అనేక మంది తేలికపాటి వాహన చోదకులు వీటిని బిగించుకున్నారు. మోగిస్తే తప్ప ఈ ఉల్లంఘన విషయం ట్రాఫిక్‌ పోలీసులకు తెలియదు. మరి ఇలాంటి వారికి చెక్‌ చెప్పడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు విజిలెన్స్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది, కెమెరాల కంటికి కనిపించని ఉల్లంఘనలకు సైతం ఆస్కారం ఇవ్వద్దంటూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ ఈ బృందాలకు రూపమిస్తున్నారు. ప్రస్తుతం విధి విధానాల రూపకల్పన, సభ్యుల ఎంపిక దశలో ఉన్న ఈ టీమ్స్‌ త్వరలో క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించనున్నాయి. 

ఇలాంటి విధులకు వినియోగం.. 
► ఈ విజిలెన్స్‌ బృందాలను ట్రాఫిక్‌ విభాగం అధికారులు కొన్ని రకాలైన ఉల్లంఘనులకు చెక్‌ చెప్పడానికి రంగంలోకి దింపుతున్నారు. సైరన్ల వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లు, మల్టీ టోన్డ్‌ హారన్లు, ఎయిర్‌ హారన్ల వినియోగం, అనధికారికమైన బుగ్గ కార్లు, సిగ్నల్‌ జంపింగ్, ఓవర్‌ స్పీడింగ్‌ తదితర ఉల్లంఘనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

►వీటిలో కొన్ని ఉల్లంఘనల్ని చౌరస్తాలు దాటేసిన తర్వాత, లేదా వాహనచోదకులు వినియోగించినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతోంది. ఈ కారణంగానే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బంది ఈ వాహనచోదకులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉల్లంఘనుల కారణంగా ఇతర వాహనచోదకులకు ఇబ్బందులు కలగడంతో పాటు శబ్ధ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ఈ విషయం గమనించిన ఉన్నతాధికారులు విజిలెన్స్‌ టీమ్స్‌కు రూపమిస్తున్నారు.  

మొత్తం 48 మంది కానిస్టేబుళ్లు.. 
నగర ట్రాఫిక్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. ప్రాథమికంగా జోన్‌కు రెండేసి బృందాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీమ్‌కు ప్రత్యేక వాహనం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. పని ఒత్తిడికి తావు లేకుండా రెండు షిఫ్టుల్లో వినియోగించడానికి మొత్తం 48 మందిని ఎంపిక చేస్తున్నారు. వీరికి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పించాలని ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా జంక్షన్ల వద్ద మాటు వేసి ఉండే ఈ బృందాల పని తీరును స్వయంగా ఉన్నతాధికారులే పర్యవేక్షించనున్నారు. స్పీడింగ్, సిగ్నల్‌ జంపింగ్‌ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిలో యువతే ఎక్కువగా ఉంటాయి. వీరిని వెంబడించి, అడ్డుకోవడానికి ఈ టీమ్స్‌ ప్రయత్నిస్తే వాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రమాద హేవుతుగానూ మారుతుంది. 
 
టీటీఐలో ప్రత్యేక శిక్షణ.. 
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు విజిలెన్స్‌ టీమ్స్‌ కారణంగా ఎలాంటి అపశ్రుతులు, వాహన చోదకులతో పాటు ఉల్లంఘనులకూ ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో (టీటీఐ) వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఆయా ఉల్లంఘనులకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ చెక్‌ చెప్పాలి? వారితో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న, నడుస్తున్న వారికి ఎలాంటి హాని లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలు ఈ శిక్షణలో వారికి నేర్పుతున్నారు. ఈ విజిలెన్స్‌ టీమ్స్‌ను ప్రథమ చికిత్స, సీపీఆర్‌ తదితరాల్లోనూ నిష్ణాతులను చేయాలని నిర్ణయించారు. కేవలం ఉల్లంఘనులకు చెక్‌ చెప్పడానికే కాకుండా వర్షాలు, నిరసనలతో పాటు ఇతర కారణాల వల్ల హఠాత్తుగా తలెత్తే తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్స్‌ క్లియరెన్స్‌ కోసమూ వినియోగిస్తారు. (క్లిక్ చేయండి: పీసీఎస్‌ హెడ్‌– క్వార్టర్స్‌గా ఐసీసీసీ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top