Ganesh Immersion 2021-Hyderabad: ఈ ఏడాది నిమజ్జన చెరువులు ఇవే.. 

Hyderabad: Telangana Govt Seat Arrangement For Ganesh Nimajjanam - Sakshi

నిమజ్జన చెరువులు 32

గుర్తించిన జీహెచ్‌ఎంసీ

106 స్టాటిక్‌ క్రేన్లు.. 208 మొబైల్‌ క్రేన్లు ఏర్పాటు

అంచనా వ్యయం రూ.13.50 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో: త్వరలో రానున్న వినాయకచవితి పండుగను పురస్కరించుకొని వినాయక విగ్రహాల నిమజ్జనం, తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. వీలైనంత వరకు ఎక్కడికక్కడే స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. హుస్సేన్‌ సాగర్‌తో సహ 32 చెరువులు, కుంటల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిమజ్జనాలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

హుస్సేన్‌సాగర్‌తోపాటు మిగతా 31 చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనాల కోసం అవసరమైన క్రేన్లు, సిబ్బంది సమకూర్చుకునే పనిలో పడ్డారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం  హుస్సేన్‌సాగర్‌ వద్ద దాదాపు 55 పెద్ద క్రేన్లు (స్టాటిక్‌) అవసరమని భావిస్తున్నారు. వినాయక ఉత్సవాలకు సంబంధించి తీసుకునే చర్యలు, చేసే ఏర్పాట్లపై నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోనున్నారు.  

►    హైదరాబాద్‌లో.. నిమజ్జనాల కోసం 106 స్టాటిక్‌ క్రేన్లు, 208  మొబైల్‌ క్రేన్లు, జేసీబీలు తదితరమైనవి  అందుబాటులో ఉంచుతారు. 
►    క్రేన్ల అద్దె, నిమజ్జనం చివరి రోజు వరకు వాటిని వినియోగించేందుకు అవసరమైన సిబ్బంది, తదితరమైన వాటికి దాదాపు రూ. 13.50 కోట్లు  ఖర్చు కానుందని అంచనా. 
►    ప్రధాన రహదారులతోపాటు నిమజ్జనానికి విగ్రహాలు ప్రయాణించే దాదాపు 350 కి.మీ.ల మేర మార్గాల్లో రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా వాహనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేయనున్నారు.  
►    కరోనా నిరోధక చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. నిమజ్జన మార్గాల్లో శానిటైజర్లు,మాస్కు లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.  
►    ప్రతియేటా మాదిరిగానే తాత్కాలిక టాయ్‌లెట్లు, తాగునీటి  ఏర్పాట్లు,  వైద్య కేంద్రాలు,  విద్యుత్‌  తదితర సదుపాయాలు కల్పించనున్నారు. 

నిమజ్జన చెరువులు ఇవే.. 
హుస్సేన్‌సాగర్, కాప్రా, చర్లపల్లి, నల్లచెరువు, నాగోల్, మన్సూరాబాద్‌ పెద్దచెరువు, సరూర్‌నగర్, మీర్‌ఆలం ట్యాంక్, పల్లెచెరువు, పత్తికుంట, జంగమ్మెట్, రాజన్నబావి, ఎర్రకుంట, దుర్గంచెరువు, గోపిచెరువు, మల్కం చెరువు, గంగారం పెద్దచెరువు, కొత్తకుంట(ప్రకాశ్‌నగర్‌), గుర్నాథం చెరువు, కైదమ్మకుంట, రాయసముద్రం, సాకి చెరువు, ఐడీఎల్, సున్నం చెరువు, హస్మత్‌పేట, అంబీరు చెరువు, వెన్నెలగడ్డ, పరికి చెరువు, లింగంచెరువు, కొత్తచెరువు, బండచెరువు, సఫిల్‌గూడ మినీట్యాంక్‌బండ్‌. 

పర్యావరణ గణపతికి జై 
పర్యావరణ గణపతి (మట్టి గణపతి)కి హెచ్‌ఎండీఏ జైకొట్టింది. ఈమేరకు తొలి మట్టి విగ్రహాన్ని శుక్రవారం స్పెషల్‌ సీఎస్, హెచ్‌ఎండీఎ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు అందజేశారు. ఆయన వెంట హెచ్‌ఎండీఎ చీఫ్‌ ఇంజనీర్‌ బి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ పరంజ్యోతి కూడా ఉన్నారు. ప్రజలను మట్టి విగ్రహాల వైపు మళ్లించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు పేర్కొన్నారు.

చదవండి: వైరల్‌: మంత్రి ట్రై చేశాడు కుదరలే.. పళ్లతో కట్‌ చేసేశాడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top