మహిళా నిరసనకారుల కోసం మహిళా పోలీసులతో స్వాట్ | Hyderabad police launches Swift Women Action Team to manage female protestors | Sakshi
Sakshi News home page

మహిళా నిరసనకారుల కోసం మహిళా పోలీసులతో స్వాట్

Jun 4 2025 5:58 AM | Updated on Jun 4 2025 5:58 AM

Hyderabad police launches Swift Women Action Team to manage female protestors

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో తాము నేర్చుకున్న మెళకువలను ప్రదర్శిస్తున్న ‘స్వాట్‌’ బృందం పోలీసులు

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

అతివల గౌరవానికి భంగం కలగకుండా అదుపులోకి తీసుకునేందుకు తర్ఫీదు

35 మందికి వివిధ అంశాల్లో 45 రోజుల శిక్షణ

ఈ టీమ్స్‌ను ప్రారంభించిన కొత్వాల్‌ సీవీ ఆనంద్‌

సాక్షి, హైదరాబాద్‌: నిరసనలు..ధర్నాలు..ఆందోళనల్లో పాల్గొనే మహిళలను అదుపులోకి తీసుకునే సమయంలో వారి ఆత్మగౌర వానికి భంగం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పోలీ సులు స్వాట్‌ (స్విఫ్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీమ్‌) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకొని, పోలీస్‌స్టేషన్లకు తరలించే సందర్భాల్లో తరచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలను నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో ప్రారంభించారు.

ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన...
హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో ఉన్న డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు గత ఏడాది డిసెంబర్‌లో నిరసన తెలిపారు. వీరిని ముందస్తు అరెస్టు చేయడానికి అవసరమైన స్థాయిలో మహిళాపోలీసులు లేకపోవడం, ఉన్న వారికీ నైపుణ్యం లేకపోవడంతో ఆ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పోలీసులు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు విభాగం మహిళా నిరసనకారుల్ని అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసులతో కూడిన వింగ్‌ ఉండాలని నిర్ణయించింది. దీంతో నగర సాయుధ విభాగం (సీఏఆర్‌) హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన 2024 బ్యాచ్‌ కానిస్టేబుళ్లతో స్వాట్‌ టీమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఒక్కో ప్లటూన్‌లో 21 మంది చొప్పున రెండింటికి రూపం ఇవ్వడానికి సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

బైక్‌ స్టంట్‌తో అబ్బురపరిచిన పూజ...
ప్రదర్శన సందర్భంగా స్వాట్‌ సభ్యురాలు పి.పూజ బైక్‌ స్టంట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈమె కడుపుపై ఓ చెక్క పెట్టిన శిక్షకులు దాని మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. దీనికోసం తాను ఎలాంటి ప్రాక్టీసు చేయలేదని, కేవలం డెమో నిర్వహించి నేరుగా వచ్చానని వివరించారు. జాతీయస్థాయిలో వాలీబాల్‌ ప్లేయర్‌ అయిన పూజ.. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లోనూ పాల్గొన్నారు. వాలీబాల్‌లో గోల్డ్, ఆర్మ్‌ రెజ్లింగ్‌లో బ్రాంజ్‌ మెడల్స్‌ గెల్చుకున్నారు.

ఎలాంటి దుస్తులు ధరించినా నేర్పుగా 
నిరసన తెలుపుతున్న మహిళలందరూ ఒకే విధమైన దుస్తులు ధరించరు. చీర, చుడీదార్, జీన్స్‌ ఇలా ఏ రకమైన వస్త్రాలు ధరించిన వారిని ఎలా అదుపులోకి తీసుకోవాలి అనే దానిపై ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. ఒకే చోట గుంపుగా ఉన్న ఆందోళనకారుల్నీ సోలార్‌ లాక్, ప్రామిస్‌ లాక్‌ అనే టెక్నిక్స్‌ వాడుతూ ఎలా లిఫ్ట్‌ చేయాలన్నది నేర్చుకున్నాం. – జె.ఉమ

రెండు రకాల మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ
స్వాట్‌ ట్రైనింగ్‌లో భాగంగా జిమ్‌ వ్యాయామంతోపాటు రెండు రకాలైన మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించారు. కరాటేలో కట్టాస్, పంచెస్, సెల్ఫ్‌ డిఫెన్స్, కిక్స్‌... క్రావ్‌మగాలో రియల్‌ ఫైట్, ఏడు మూవ్‌మెంట్స్‌లో ఎదుటి వ్యక్తిని నేలకూల్చడం తదితర అంశాల్లో అవగాహన కల్పించారు. – టి.శిల్పవర్ధన్‌

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో స్వాట్‌ బృందాల ప్రదర్శన 
తొలి దశలో 35 మందిని స్వాట్‌ కోసం ఎంపిక చేశారు. వీరికి పోలీసులతోపాటు మార్షల్‌ ఆర్ట్స్, మాబ్‌ కంట్రోల్‌ ఎక్స్‌పర్ట్స్‌తో 45 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. మహిళలతోపాటు పురుష నిరసనకారుల్ని అదుపు చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, ఎలాంటి ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడటం, నిరసనల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు. గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో స్వాట్‌ బృందాలు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించాయి. సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేతృత్వంలో పని చేయనున్న ఈ బృందాలకు ఆర్‌ఎస్సై మౌనిక పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. త్వరలోనే మరో ఏడుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement