
ఫుకెట్ విమానంలో సమస్యతో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్
శంషాబాద్ (హైదరాబాద్): టేకాఫ్ తీసుకున్న ఎనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఫుకెట్ విమానం వెనక్కి తిరిగి వచి్చంది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్–110 విమానం (బోయింగ్ 737) శనివారం ఉదయం 6.41 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరేందుకు టేకాఫ్ తీసుకుంది. విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు.
ఉదయం 6.49 గంటల సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. ఏటీసీ అనుమతి మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 6.57 గంటలకు సురక్షితంగా దించారు. సాంకేతిక సమస్యల సర్దుబాటు అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి ఫుకెట్ విమానం బయల్దేరినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.