
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.
ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు.
అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.