
ఈ ఏడాది నష్టాలు రూ.625.88 కోట్లు
మొత్తం నష్టాలు రూ.6,605.51 కోట్లు
4.5 లక్షలకు తగ్గిన ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. ఆదినుంచీ నష్టాల బాటలోనే పరుగులు తీస్తోంది. ఇప్పటివరకు మొత్తం రూ.6,605.51 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.625.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం ఆదాయం రూ.1,108.54 కోట్లు కాగా, మొత్తం నిర్వహణ ఖర్చు రూ.1,734.45 కోట్ల వరకు నమోదైంది.
పన్ను చెల్లింపుల అనంతరం వార్షిక నష్టం రూ.625.88 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నగరంలో నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్– మియాపూర్, ఎంజీబీఎస్–జేబీఎస్‌ల మధ్య ప్రస్తుతం 57 రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. గతేడాది వరకు సుమారు 4.85 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఈ ఏడాది మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్– రాయదుర్గం, ఎల్‌బీ నగర్– మియాపూర్ రూట్లలోనే ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి.