
జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ
దసరా పండుగపై తెలంగాణలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు గాంధీ జయంతి కూడా ఉంది. దీంతో.. మద్యం, మాంసం ప్రియులకు అసమంజస పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో..
హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2న జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని విభాగం 533 (బి) ప్రకారం ఈ నెల 24న జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఆ మేరకు సోమవారం జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులందరూ సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.