Hyderabad: సిటీలో క్రికెట్‌ జోష్‌.. మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో..

Hyderabad: India Pakistan Match Telecast On Big Screens - Sakshi

టీ20 వరల్డ్‌ కప్‌లో నేడు ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌ 

భారీ స్క్రీన్లపై మ్యాచ్‌ చూసేందుకు ఏర్పాట్లు 

బెట్టింగ్‌పై భారీ నిఘా

సాక్షి, హైదరాబాద్‌: సిటీలో క్రికెట్‌ జోష్‌ పెరిగింది. ఎక్కడ చూసినా టీ20 ఫీవర్‌ కన్పిస్తోంది. సుదీర్ఘకాలం తరువాత ప్రస్తుత టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆదివారం భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నగర క్రికెట్‌ అభిమానుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  

భారీ స్క్రీన్స్‌పై... 
అభిమానులు ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్‌ను చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వీరిని ఆకర్షించడానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఈసారి అత్యధిక సంఖ్యలో లైవ్‌ టెలికాస్ట్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మల్లీప్లెక్స్‌ థియేటర్స్‌లోనూ క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారీ తెరలపై ప్రదర్శించడానికి కొందరు యజమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండాపూర్, కోకాపేట్‌లాంటి ప్రాంతాల్లోని కొన్ని లగ్జరీ విల్లాల్లో కమ్యూనిటీ స్క్రీనింగ్‌లో మ్యాచ్‌ను తిలకించడానికి ఏర్పాట్లు చేశారు.  

జోరుగా బెట్టింగ్‌... 
ఇండియా–పాకిస్తాన్‌ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని మొబైల్‌ యాప్స్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ బెట్టింగ్‌ రాకెట్‌లో ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్ట్‌ చేశారు.

ఇండియా పాకిస్తాన్‌ మ్యాచ్‌ కావటంతో రూ.1,000 బెట్టింగ్‌పై రూ.20, 30 వేలకు పైగానే పందెం సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 94906 17444 వాట్సాప్‌ నంబర్‌లో సంప్రదించాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు. 

చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top