కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు

Hyderabad: Helping Hands Covid Patients Critical Situation Sonu Sood - Sakshi

కష్టం వచ్చినప్పుడే ధైర్యం కావాలి.. ధైర్యమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. ఆలోచన పరిష్కార మార్గాలను చూపిస్తుంది.. సహాయమార్జించడం.. సహాయం అందించడం ఈ రెండూ ఆ మార్గాల్లోనివే!! పెద్ద విపత్తే వచ్చి పడింది.. ఆ రెండు అవసరాలకూ పరీక్ష పెడుతోంది.. కిందటి సారి ఇంచుమించు ఇదే సమయం, సందర్భంలో.. సొంతూళ్లకు కదిలివెళ్లిన పాదచారులకు అన్నం పెట్టి, సద్ది మూట ఇచ్చి, జేబుల్లో, కొంగు మూడిలో కొంత పైకం సర్ది, పిల్లలకు జోళ్లు, బట్టల జతలు పెట్టి, చేతిలో పళ్లు ఉంచి... దారెంట జాగ్రత్తలు చెప్పి సాగనంపిన మనసులు... బస్సులు మాట్లాడీ  బాటసారులను బయలెల్లదీసిన మనుషులు.. ఇప్పుడూ కనిపిస్తున్నారు.

 కరోనాతో గడపదాటలేని కుటుంబాలు.. వీధి బహిష్కరణతో తలుపులు చాటేసుకున్న ఇళ్లు.. ఆక్సిజన్‌ అందక ఆగమాగం అవుతున్న జీవితాలు, వెంటిలెటర్‌ కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఆగిన బతుకులు.. బెడ్స్‌ దొరక్క బెంబేలెత్తుతున్న బంధువులు.. దొరికినా లక్షల్లో డబ్బు కట్టలేక.. మందుల్లేక.. ఉన్నా కొనే ఆర్థికపరిస్థితి సహకరించక.. మందులు, ఆసుపత్రి ఆగత్యంలేని..  బలవర్ధకమైన ఆహారం తినాల్సిన బాధితులు.. అన్నీ ఉన్నా వండుకునే శక్తిలేని పీడితులకు ఆపన్న హస్తం అందించే మనుషులు ఇప్పుడూ కనిపిస్తున్నారు.

రియల్‌ హీరో
రియల్‌ హీరో.. అనగానే సోనూ సూదే గుర్తొస్తాడు. కిందటేడు లాక్‌డౌన్‌ మొదలు ఇప్పటిదాకా అలుపు లేకుండా సేవలను అందిస్తున్నాడు. రియల్‌ హీరోగా కనిపిస్తున్నాడు. సామాన్యుడి నుంచి  సెలబ్రటీస్‌ దాకా ఎవరికి  కష్టం వచ్చినా సోనూ సూద్‌నే తలుచుకుంటున్నారు. ఇందుకు నిన్నమొన్నటి ఉదాహరణ.. 2021 ఐపీఎల్‌ రద్దు. ఇండియాలో చిక్కుకున్న విదేశీ ఆటగాళ్లను ఇంటికి చేర్చాలని ట్విట్టర్‌ వేదికగా సురేష్‌ రైనా సోనూసూద్‌ను కోరిన వెంటనే ‘ప్యాక్‌ యువర్‌ బాగ్స్‌’ అంటూ సంద్పించాడు సోనూ.

ఇలా  కరోనా  కష్టకాలంలో సోనూ చేసిన సేవలు ఎన్నో! చిన్న పిల్లల చదువుకోసం స్మార్ట్‌ఫోనులు, నిరాశ్రయులకు ఆహారం, నిత్యావసర సరుకులు, బట్టలు.. ఎన్నని చెప్తాం స్వచ్ఛందంగా అతను చేస్తున్న పనులను! సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ సిలిండర్స్‌ను విదేశాల నుంచి కొనుగోలు చేసి అవసరమైన వారికి పంపిస్తున్నాడు. ఇందుకు ఆయన తన ఆస్తులన్నింటిని అమ్ముకోగా, మరో పదికోట్ల ఆస్తులను తాకట్టు పెట్టాడు. ‘అర్థరాత్రి అపరాత్రి  కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. వీళ్లలో కనీసం కొంతమందికైనా ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్‌ అందించి వాళ్ల ప్రాణాలను కాపాడగలిగితే వంద కోట్ల సినిమా చేయడం కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ సంతృప్తి మిగులుతుంది’ అంటాడు సోనూ సూద్‌.

అన్నదాత..
 నిహారిక రెడ్డి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌. ప్రస్తుతం ఆమె ఇల్లు  ఓ మెస్‌ను తలపిస్తోంది. కరోనా బారినపడి హోమ్‌ ఐసోలేషన్‌ లో ఉంటున్న వారి కోసం ఆ ఇంటి వంటిగది విరామెరుగక వండుతూనే ఉంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్, బంజారా హిల్స్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌కు చెందిన సుమారు మూడు వందల పైగా మందికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడానికి తానే స్వయంగా వండి వడ్డిస్తోంది  నిహారిక. ఈ బాధ్యతలో ఆమె కుటుంబమంతా పాలుపంచుకుంటోంది. ఆమె  పిల్లలు కూడా ఆటలు, పాటలు అన్నీ మానేసి వంటపనిలో నిమగ్నమయ్యారు.

కూరలు తరగడం, వండిన వంటను ప్యాక్‌ చేయడంలో తల్లికి తోడ్పడుతున్నారు. ఇలా తయారైన వంటను నిహారిక  సోదరుడు, డ్రైవర్‌ కలసి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటోన్న వారికి అందిస్తున్నారు. ప్రొటీన్లు, ఇతర పోషక పదార్థాలు కలిగిన కూరలతోపాటు  వెజిటేబుల్‌ సలాడ్, డ్రై ఫూట్స్‌ లడ్డూ కూడా ఉంటాయి మెనులో. హామ్‌ఐసోలేషన్‌లో ఉన్నవారు  కరోనా పాజీటీవ్‌ రిపోర్ట్, ఇంటి చిరునామాను ఈ  హెల్ప్‌లైన్‌ నెం. 9701821089కు పంపి, ఫోన్‌ చేస్తే .. ఆ చిరునామా  వీళ్లు  అందించగల దూరంలో ఉంటే ఆ తర్వాత రోజు నుంచే ఆ ఇంటికి వండిన ఆహారాన్ని పంపిస్తారు. 

కరోనాలో చదువు కోసం ..
ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాల్యం ఆన్‌లైన్‌ క్లాసులకే అంకితమై పోయింది. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌లు తప్పనిసరయ్యాయి.  తల్లిదండ్రులు లేని విద్యార్థులకు, ఉన్నా ఆర్థికంగా వెనకబడిన పిల్లల కోసం ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు అందిస్తూ, అనాథశ్రయాల్లో గ్రూప్‌ ఆన్‌లైన్‌ కోర్సులను నిర్వహిస్తోంది ‘ప్యూర్‌ ఆర్ఫన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యూకేషన్‌’ అనే స్వస్థంచ సంస్థ. 2016లో గిరిజన ప్రాంత పిల్లల చదువు కోసం ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మధ్యాహ్నభోజనం కోసమే బడికి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని తెలిసి.. పేద విద్యార్థులు, నిరాశ్రయులతోపాటు హోమ్‌ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా రోగులకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తోందీ సంస్థ.

కరోనా వల్ల ఇబ్బంది పడిన వలస కూలీల కోసం ఈ సంస్థ బస్సులను ఏర్పాటు చేసి, సుమారు మూడు వేలమందికి పైగా కూలీలను వారి ఇళ్లకు చేర్చింది. వీరిలో నిండు గర్భీణీలూ  ఉండటం గమనించి వారిని ఆసుపత్రిలో చేర్పించింది. ఈ కరోనా సమయంలో  ఏదైనా సహాయం కావాలనుకునేవారు తమ హెల్ప్‌లైన్‌ నంబర్లు  7386120040, 7675940040 లకు ఫోన్‌ చేస్తే చాలు సహాయం అందించడానికి సిద్ధం అంటున్నారు ఈ సంస్థ సభ్యులు. 

నిరాశ్రయులకు ఆసరా..  నిత్యావసరాల సరఫరా
అనాథల కోసం  దశాబ్దం కిందట మొదలైన  ‘దిశా ఫౌండేషన్‌’ ప్రస్తుతం తన సేవలను కరోనా బాధితుల కోసమూ విస్తరించింది.  ప్రతి రోజూ వందల సంఖ్యలో మందులు, మాస్కులతో పాటు అవసరమైన వారికి నిత్యావసర సరుకులు, నిరాశ్రయులకు అహారం అందిస్తున్నారు. త్వరలోనే ఎల్‌బీ నగర్‌లో ఓ ఐసోలేషన్‌ సెంటర్‌నూ  ఏర్పాటు చేయనుంది.  వీటితోపాటు గుంటూరులోని క్యాన్సర్‌ ఆసుపత్రి దగ్గర నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. 
అందరూ ఒక్కటై
ఇలాంటి సమయంలో నేను, నాది.. నా అనే ఆలోచనలు పోయి, మనం అనే భావన రావాలి. పది మందికి సాయం చేయలేకపోయనా కనీసం ఒక్కరికైనా  సాయం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. కరోనా నుంచి కాపాడుకునే చర్యలు తీసుకోవాలి.
– సుస్మిత జగ్గి రెడ్డి 
దిశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ష్యాషన్‌ డిజైనర్‌.
 

వృద్ధుల కోసం... 
 కరోనా దాటికి రాలిపోతున్న వృద్ధులను చూసి చలించిపోయింది హిమజ.  అందుకే వారి కోసం ఉచితంగా మందులు, ఆహారం పంపిణీ చే స్తోంది. అలా ఇప్పటి వరకు సుమారు పదిహేను వందల మందికిపైగా సహాయం అందించింది ఆమె. సేవా కార్యక్రమాలు ఆమెకు కొత్త కాదు.  గత ఆరేళ్లుగా  ఆనాథ పిల్లల కోసం కృషి చేస్తోంది. క్యాన్సర్‌ రోగులకు వైద్యసహాయంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు విగ్గులను అందిస్తోంది. 

కరోనా కష్టకాలంలో సేవలందిస్తోన్న మరికొన్ని హెల్ప్‌లైన్‌ నెంబర్లు.. 
ఎమ్మెల్సీ కవిత కార్యాలయం: 898569993
ఎల్‌హెచ్‌ఓ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం: 8374303020, 8688919729 

చదవండి: గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top