నిర్లక్ష్యం పెరిగింది..మూడో వేవ్‌ ముందుంది!

Hyderabad: Health Experts Flag Concerns Over 3rd Wave Likelihood - Sakshi

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆందోళన 

గుంపులుగా తిరుగుతున్న జనం 

యాంటీబాడీస్‌ తగ్గిపోతున్నాయి 

ఇలాగైతే మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గిందనగానే చాలా మందిలో నిర్లక్ష్యం ఆవరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా ఉధృతి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్న వారు కూడా.. ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు కోవిడ్‌ జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని పేర్కొంటోంది. ముఖ్యంగా కరోనా నియంత్రణలో కీలకమైన మాస్క్‌లను కూడా ధరించడం లేదని, ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది పద్ధతి మార్చుకోవడం లేదని చెబుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ కొద్దిరోజులుగా వరుస సమీక్షలు నిర్వహిస్తోంది.

కరోనా నియంత్రణ చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, మూడో వేవ్‌ వస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగానే కోవిడ్‌ జాగ్రత్తలపై జనం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి కరోనా రెండో దశ కొనసాగుతూనే ఉందని, సగటున రోజుకు ఏడెనిమిది వందల కేసులు నమోదవుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. దీనికితోడు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల పేరుతో ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడుతున్నారని.. తిరిగి కరోనా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, మూడో వేవ్‌ ముప్పు ముందుందని సూచించారు. 

యాంటీబాడీస్‌ తగ్గిపోతున్నాయి 
రెండో వేవ్‌లో వైరస్‌ సోకి తగ్గినవారు, వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో కరోనా యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయని.. అందువల్లే ప్రస్తుతం కరోనా ఉధృతి కాస్త నియంత్రణలో ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే చాలా మందిలో యాంటీబాడీస్‌ తగ్గిపోతున్నాయని.. కొందరిలో ఆరు నెలలు ఉంటే, మరికొందరిలో రెండు, మూడు నెలలే ఉంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. యాంటీబాడీస్‌ తగ్గిపోయినవారు మళ్లీ కరోనా బారినపడే ప్రమాదం ఉందని, అందువల్ల జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తున్నారు. రెండో వేవ్‌లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్‌ వల్ల వచ్చినవేనని, వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, దాని ప్రభావం తీవ్రంగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికీ కేరళ, మహారాష్ట్రలలో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. కరోనా నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమని స్పష్టం చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top