Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ

Hyderabad: Government Approves More Flyovers Construction In Uppal Area - Sakshi

రూ. 311 కోట్లతో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం 

ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు టు నారపల్లివరకు కొనసాగుతున్న పనులు  

సాక్షి, ఉప్పల్‌( హైదరాబాద్‌): ఉప్పల్‌ సర్కిల్‌లో మరిన్ని ప్‌లై ఓవర్లకు జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు. భవిషత్‌లో రానున్న ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రింగ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ భారాన్ని తగ్గించేందుకు ముందస్తుగా మరో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతి పాదనలను అధికారులు సిద్ధం చేశారు. దాదాపుగా రూ.311 కోట్లతో ఈ ప్రాజెక్టు సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. స్కైవేకు ఇరువైపుల రెండు వంతెనలతో పాటు, మెట్రోరైల్‌ వంతెనకు రెండు వైపుల మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 

దాదాపు రూ.658 కోట్లతో.. 
► ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న స్కై ఓవర్‌ (ఎలివేటెడ్‌ కారిడార్‌) పనులు కొనసాగుతున్న విషయం విధీతమే.  
► ఉప్పల్‌ చౌరస్తా నుంచి నారపల్లి వరకు 6.4 కిలో మీటర్ల పొడవుతో దాదాపు రూ. 658 కోట్లతో నిర్మిస్తున్నారు. 
► భవిషత్‌లో వరంగల్‌ నుంచి ఇటు సికింద్రాబాద్‌ మరో పక్క ఎల్‌బినగర్‌ వైపు, ఇంకోపక్క రామంతాపూర్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ అంతా ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద కేంద్రీకృతమయ్యే ట్రాఫిక్‌ను అధిగమించేందుకు ఈ వంతెనలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  
చక చకా పనులు.. 
► ఎలివేటెడ్‌ కారిడార్‌ ముగింపు ప్రాంతం నుంచి రామంతాపూర్‌ క్రికెట్‌ స్టేడియం రోడ్డు వద్ద తిరిగి ఉప్పల్‌ పారిశ్రామిక వాడ మోడ్రన్‌ బేకరీ చౌరస్తా నుంచి ఉప్పల్‌ వరకు రోడ్డుకు ఇరువైపుల రెండు ప్‌లై ఓవర్లును నిర్మించనున్నారు.  
► మరో వైపు ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌ కళాశాల గేటు నుంచి నాగోల్‌ రోడ్డు ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ రాజ్యలక్ష్మి థియేటర్‌ వరకు అటు నుంచి నాగోల్‌ రోడ్డు నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్‌ ఇండియా గేట్‌ వరకు మొత్తం నాలుగు ప్‌లైఓవర్లను నిర్మించనున్నారు.  
► ఇందుకు సంబంధించిన రోడ్డు వెడల్పు పనులను కూడా ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు చకా చకా ప్రారంభించారు. 
► హబ్సిగూడ నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు మీదుగా నాగోల్‌ రోడ్డు రాజ్యలక్ష్మి థియేటర్‌ వరకు 1.5 కిలో మీటర్ల పొడవున ప్రస్తుతం 30 మీటర్ల రోడ్డు ఉండగా దానిని 60 మీటర్ల వరకు పొడగించనున్నారు.  
► రోడ్డు వెడల్పులో భాగంగా 25 ప్రాపర్టీస్‌ ఎఫెక్ట్‌ అవుతుండగా అందులో 6 ప్రభుత్వ ప్రాపర్టీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

రింగ్‌ రోడ్డుపై భారం తగ్గించడమే లక్ష్యం..  
వరంగల్‌ జాతీయ రహదారి వైపు నుంచి స్కైవే పైగా వచ్చే ట్రాఫిక్‌ ఉప్పల్‌ జంక్షన్‌ వద్దకు రాగానే తిరిగి ట్రాఫిక్‌ సమస్య తలెత్తే ప్రమాదముంది. అటు వైపు నుంచి హబ్సిగూడ, రామంతాపూర్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ తీవ్రరూపం దాల్చకముందే రింగ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ భారాన్ని తగ్గించేందుకు ఉప్పల్‌ సర్కిల్‌ ప్రాంతంలో నాలుగు సమాంతర ఫ్లై ఓవర్లను నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. ప్రతిపాదనలు పూర్తవ్వగానే పనులను ప్రారంభిస్తాం.  
– రవీందర్‌ రాజు, ఎస్‌ఈ, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు విభాగం   

నాగోల్‌ వైపు 60 మీటర్ల రోడ్డు.. 
ఉప్పల్‌ చౌరస్తా మీదుగా నాగోల్‌ వైపు 60 మీటర్ల రోడ్డును వెడల్పు చేయనున్నాం. మొదటి దశగా ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌ నుంచి రింగ్‌ రోడ్డు మీదుగా రాజ్యలక్ష్మి థియేటర్‌ వరకు అక్కడి నుంచి హబ్సిగూడ వైపు సర్వే ఆఫ్‌ ఇండియా గేటు వరకు రోడ్డుకు ఇరువైపుల రోడ్డు వెడల్పుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రోడ్డు వెడల్పులో నష్టపోయే 25 ఆస్తులను గుర్తించాం. 
 – శ్రావణి, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ, ఉప్పల్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top