Cyberabad Police Commissionerate: సైబరాబాద్‌లో 5 జోన్లు!

Hyderabad: Cyberabad Police Commissionerate will Change - Sakshi

కొత్తగా రాజేంద్రనగర్, మేడ్చల్‌ జోన్లు

రెండు జోన్లుగా ట్రాఫిక్‌ విభాగం

ట్రాఫిక్‌కు కొత్తగా జాయింట్‌ సీపీ

హైదరాబాద్‌ తరహాలో ఏర్పాటుకు కసరత్తు

కొత్త ఠాణాలు, డివిజన్ల కూర్పులో అధికారులు

750 అదనపు పోస్టులకు ప్రభుత్వం ఆమోదం 

సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం నుంచి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ స్వరూపం మారనుంది. హైదరాబాద్‌ తరహాలో సైబరాబాద్‌ కూడా ఐదు జోన్లతో కార్యకలాపాలు సాగించనుంది. ఇప్పటికే శాంతి భద్రతల విభాగంలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్, మేడ్చల్‌ జోన్లు అవతరించనున్నాయి. ట్రాఫిక్‌ విభాగాన్నీ రెండు జోన్లుగా విభజించి, జాయింట్‌ సీపీ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు ఆయా ఏర్పాట్లపై సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. 

3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో సుమారు ఏడు లక్షల జనాభా ఉంది. పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో సైబరాబాద్‌ విస్తరిస్తుంది. దీంతో కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైంది. ఈ మేరకు ప్రస్తుతం బాలానగర్‌ జోన్‌లో భాగంగా ఉన్న మేడ్చల్‌ను వేరే చేసి కొత్తగా మేడ్చల్‌ జోన్‌ను, అలాగే ప్రస్తుతం శంషాబాద్‌ జోన్‌లో ఉన్న రాజేంద్రనగర్‌ను విడదీసి రాజేంద్రనగర్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే సైబరాబాద్‌కు 750 కొత్త పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో ఒక జాయింట్‌ సీపీ, నాలుగు డీసీపీ, ఏడు అదనపు డీసీపీ, ఎనిమిది ఏసీపీ ర్యాంకు పోస్టులు కాగా.. మిగిలినవి ఇన్‌స్పెక్టర్, ఆ కింది స్థాయి ర్యాంకు పోస్టులున్నాయి. 
 
కొత్త జోన్‌ల స్వరూపం ఇదే: 
మేడ్చల్‌ జోన్‌: ఈ జోన్‌లో మేడ్చల్, పేట్‌బషీరాబాద్‌ డివిజన్లుంటాయి. మేడ్చల్‌ డివిజన్‌లో కొత్తగా ఏర్పాటయ్యే సూరారం, జీనోమ్‌వ్యాలీతో పాటు ఇప్పటికే ఉన్న మేడ్చల్, దుండిగల్‌ ఠాణాలుంటాయి.

రాజేంద్రనగర్‌ జోన్‌: ఈ జోన్‌లో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లుంటాయి. రాజేంద్రనగర్‌ డివిజన్‌లో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, నార్సింగితో పాటు కొత్తగా ఏర్పాటుకానున్న అత్తాపూర్‌ ఠాణా కూడా ఉంటుంది. 

పేట్‌బషీరాబాద్‌ డివిజన్‌లో అల్వాల్, శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లు, చేవెళ్ల డివిజన్‌లో మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్, చేవెళ్ల పీఎస్‌లుంటాయి. 

కొత్త ఠాణాలు ఇక్కడే.. 
తాజా పునర్‌ వ్యవస్థీకరణతో సైబరాబాద్‌లో ప్రతి జోన్‌లోనూ రెండేసి డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం మాదాపూర్‌ జోన్‌లో ఉన్న కూకట్‌పల్లి డివిజన్‌ను విడదీసి బాలానగర్‌ జోన్‌లో కలిపేయనున్నారు. దీంతో మాదాపూర్‌ జోన్‌లో మాదాపూర్, మియాపూర్‌ డివిజన్లు, బాలానగర్‌ జోన్‌లో బాలానగర్, కూకట్‌పల్లి, శంషాబాద్‌ జోన్‌లో శంషాబాద్, షాద్‌నగర్‌ డివిజన్లుంటాయి. అలాగే ప్రస్తుతం సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా గండిపేట, మెకిలా, కొల్లూరు, జన్వాడ, సూరారం, జీనోమ్‌వ్యాలీ, అత్తాపూర్‌ ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. 

ట్రాఫిక్‌కు జాయింట్‌ సీపీ..  
ప్రస్తుతం సైబరాబాద్‌ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్‌ జోన్‌ ఉంది. దీన్ని రెండుగా విభజించి రాజేంద్రనగర్, మేడ్చల్‌ జోన్లుగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్‌ ఒక డీసీపీ, అదనపు డీసీపీ పర్యవేక్షణలో ఉంటాయి. కొత్తగా ట్రాఫిక్‌ విభాగానికి జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (జాయింట్‌ సీపీ)ను నియమించనున్నారు. ప్రస్తుతం సైబరాబాద్‌లో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ ట్రాఫిక్‌ డివిజన్లలో 14 పీఎస్‌లున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top