సరికొత్త చర్చకు తెరలేపిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. హంగ్‌ తప్పదా? | Hyderabad: Congress Mp Komatireddy Courts Controversy With His Forecast Of Hung Assembly | Sakshi
Sakshi News home page

సరికొత్త చర్చకు తెరలేపిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. హంగ్‌ తప్పదా?

Published Wed, Feb 15 2023 1:53 AM | Last Updated on Wed, Feb 15 2023 7:32 AM

Hyderabad: Congress Mp Komatireddy Courts Controversy With His Forecast Of Hung Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరికొత్త చర్చకు తెరలేపారు. ఎన్నికల్లో ‘హంగ్‌’ వస్తుందని.. ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలుస్తాయని ఢిల్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలే ఊపుమీద ఉన్న బీజేపీ ఈ వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా వాడుకుని విమర్శలకు దిగింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెంటనే అందుకుని.. కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, పోరాడుతున్నట్టుగా నాటకాలు ఆడుతున్నాయని తాము ముందు నుంచే చెప్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో మరోమారు రచ్చ మొదలైంది.

బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని పార్టీ నేతలు వరుసగా ప్రకటనలు చేయాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాకున్నా.. ఆ పార్టీ కేడర్‌లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పాలనను మెచ్చుకుంటూ, ప్రధాని మోదీ పాలనను తూర్పారబడుతూ అసెంబ్లీ వేదికగా గణాంకాలతో సహా సీఎం కేసీఆర్‌ ప్రసంగించిన అంశం ప్రస్తావనకు వస్తోంది. మొత్తంగా ‘హంగ్, పొత్తు’ల అంశం ఏ పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తిగా మారింది. 

‘హంగు’.. కాంగ్రెస్‌ ‘కంగు’! 
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన హంగ్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ శిబిరం ఒక్కసారిగా కంగుతిన్నది. ఈ నెల ఆరో తేదీ నుంచి హాథ్‌ సే హాథ్‌ జోడో పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జోరుగా పాదయాత్రలు చేస్తున్నారు. ఈ యాత్రలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోందనే అంచనాలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. రేవంత్‌ యాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు సీనియర్‌ నేత వీహెచ్, మరికొందరు కూడా పాల్గొంటుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న వేళ ఒక్కసారిగా వెంకటరెడ్డి చేసిన హంగ్‌ వ్యాఖ్యలతో ఆ పారీ్టలో కలవరం మొదలైంది. తాము అధికారంలోకి రాలేమని పార్టీ ఎంపీ, సీనియర్‌ నాయకుడే చెప్పడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విషయాలు ఎన్నికల తర్వాతకు సంబంధించినవే అయినా.. అటు పార్టీ కేడర్‌కు, ఇటు ఓటర్లకు తప్పుడు సంకేతాలను తీసుకువెళతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి వ్యాఖ్యలను హుటాహుటిన ఖండించే పనిలో పడ్డారు టీపీసీసీ నేతలు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు అద్దంకి దయాకర్, ఈరవత్రి అనిల్, ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఏ పారీ్టతోనూ పొత్తు ఉండబోదని, కచి్చతంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ప్రకటించారు. కేడర్‌ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, గందరగోళంలో పడేసేలా సీనియర్లు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంతర్యం ఏమైనా సరే.. ఈ వైఖరి పారీ్టకి నష్టం కలిగిస్తుందని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కొందరు నేతల నుంచి డిమాండ్‌ వినిపించడం గమనార్హం. 

ఆ రెండు పార్టీల్లోనూ ఇదే ‘ముచ్చట’! 
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీల్లోనూ మంగళవారమంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగింది. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఈ విషయంలో అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. కానీ టీవీల్లో జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు ఈ విషయంపై మాట్లాడుకున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? అని కొందరు ఆరా తీయడం కనిపించింది. ఇక బీజేపీ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు మంచి అవకాశం అనుకుంటూ అందిపుచ్చుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒకటేనని, ఈ విషయాన్ని తాము ముందునుంచీ చెప్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించినా వారు బీఆర్‌ఎస్‌లోకే వెళ్తారని కామెంట్‌ చేశారు. 

విమానాశ్రయంలో ఠాక్రే, కోమటిరెడ్డి భేటీ 
మూడు రోజుల పర్యటన కోసం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వెంకటరెడ్డి వ్యాఖ్యల దుమారంపై సమాచారం అందిన ఠాక్రే.. శంషాబాద్‌ విమానాశ్రయంలోనే కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఈ ఇద్దరు నేతలు.. కాంగ్రెస్‌తో మరే పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు తన వ్యాఖ్యలను వక్రీకరించారని, దీనిపై రాద్ధాంతం చేయాల్సిన పనిలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement