ఐఐటీలోనూ కంప్యూటర్‌ సైన్స్‌కే డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

ఐఐటీలోనూ కంప్యూటర్‌ సైన్స్‌కే డిమాండ్‌

Published Sat, Sep 17 2022 1:08 AM

Hyderabad: Computer Science Course In IIT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లోనూ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు(సీఎస్‌సీ) సీట్ల కోసం విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఐఐటీల్లో ఈసారి కూడా పోటీ తీవ్రంగానే కన్పిస్తోంది. ఐఐటీల్లో ఈ ఏడాది దాదాపు 500 సీట్లు పెరిగే వీలున్నప్పటికీ, సీఎస్‌సీకి ప్రాధాన్యం ఇచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మాదిరిగా కాకుండా ఐఐటీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

మొత్తం 23 ఐఐటీల్లో 16,598 ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా, ఇందులో బాలికలకు 1,567 సూపర్‌ న్యూమరరీ సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి సీఎస్‌సీలో ఉన్న సీట్లు 1,891 మాత్రమే. మిగతావన్నీ వివిధ రకాల కోర్సులవే. ఫలితంగా సీఎస్‌సీ కోసం ఒక్కోచోట పోటీ ఒక్కో రకంగా ఉంది. పోటీ తీవ్రంగా ఉన్న బొంబాయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో 171, ధన్‌బాద్‌ 139, కాన్పూర్‌ 129, ఢిల్లీ 99, రూర్కీలో 109 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనరల్‌ కేటగిరీలో అబ్బాయిలు 6 వేలలోపు, అమ్మాయిలు 11 వేల లోపు ర్యాంకు వస్తేనే ఎక్కడో ఒకచోట కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

బొంబాయిలో హీట్‌... జమ్మూలో కూల్‌
ఐఐటీ సీట్లు దక్కే ర్యాంకులను నిశితంగా పరిశీలిస్తే బొంబాయి ఐఐటీలో పోటీ తీవ్రంగా కన్పిస్తోంది. ఇక్కడ జనరల్‌ కేటగిరీలో బాలురకు 67వ ర్యాంకు వరకూ, బాలికలకు 361వ ర్యాంకు వరకూ మాత్రమే సీటు దక్కే అవకాశముందని కొన్నేళ్ల అంచనాలను బట్టి తెలుస్తోంది. జమ్మూ ఐఐటీలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ జనరల్‌ కేటగిరీ బాలురకు 5,238 వరకూ, బాలికలకు 10,552వ ర్యాంకు వరకూ కంప్యూటర్‌ సైన్స్‌ సీటు వచ్చే అవకాశం ఉంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement