నంబర్‌ ఇక్కడ..వాట్సాప్‌ అక్కడ!  | Hyderabad City Cybercrime Police studied DP Frauds | Sakshi
Sakshi News home page

నంబర్‌ ఇక్కడ..వాట్సాప్‌ అక్కడ! 

Published Fri, Mar 10 2023 2:44 AM | Last Updated on Fri, Mar 10 2023 8:40 AM

Hyderabad City Cybercrime Police studied DP Frauds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్‌ డీపీలతో టోపీ వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బేసిక్‌ ఫోన్లలో ఉన్న సెల్‌ నంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వాట్సాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో యాక్టివేట్‌ చేసుకుంటున్నారు. వైఫై ద్వారా కథ నడుపుతూ డబ్బు, గిఫ్ట్‌ వోచర్ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ‘డీపీ ఫ్రాడ్స్‌’పై అధ్యయనం చేసిన హైదరాబాద్‌ సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. రెండు రకాలుగా ఇతరుల వాట్సాప్‌లు సైబర్‌ నేరగాళ్ల వద్దకు వెళ్తున్నాయని గుర్తించారు. 

కొన్నాళ్లకు వినియోగించడం మానేసి.. 
ఒకరి పేరుతో ఉన్న సెల్‌ నంబర్‌కు సంబంధించిన వాట్సాప్‌ను వినియోగించుకోవడానికి సైబర్‌ నేరగాళ్లు వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.నకిలీ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో సిమ్‌కార్డులు కొని వాటి ద్వారా వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకుంటున్నారు.

ఆపై కొన్నిరోజులకు ఆ నంబర్‌ను నేరుగా వాడటం మానేసి కేవలం వైఫై ద్వారానే వాట్సాప్‌ వాడుతున్నారు. దీంతో నిర్ణీతకాలం తర్వాత సర్విస్‌ ప్రొవైడర్లు ఆ నంబర్‌ను మరొకరికి కేటాయిస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్లు ఈ నంబర్‌తో వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకోకున్నా లేదా బేసిక్‌ ఫోన్లు వాడుతున్నా వాట్సాప్‌ నంబర్‌ పాత యజమాని వద్దే ఉండిపోతోంది.  

సాధారణ ఫోన్లలో ఉన్నవి గుర్తిస్తూ.. 
సైబర్‌ నేరాల కోసం మరొకరి వాట్సాప్‌ను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి సైబర్‌ నేరగాళ్లు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ సిరీస్‌లోని నంబర్లను తమ స్మార్ట్‌ఫోన్లలో వేర్వేరు పేర్లతో సేవ్‌ చేసుకొని వాటిల్లో వాట్సాప్‌ యాక్టివేట్‌ అయిందో లేదో తెలుసుకుంటున్నారు.

యాక్టివేట్‌ కాని వాటిని వైఫై ద్వారా వాడే తమ స్మార్ట్‌ఫోన్లలో వాడటానికి ఓటీపీ అవసరం. దీంతో సేల్స్, కాల్‌సెంటర్ల పేర్లతో వారికి ఫోన్లుచేసి ఓటీపీ తెలుసుకుంటున్నారు. ఇది ఎంటర్‌ చేయడంతోనే అవతలి వారి నంబర్‌తో వాట్సాప్‌ వీరి ఫోన్లలో యాక్టివేట్‌ అవుతోంది. విషయం ఫోన్‌నంబర్‌ వాడే వారికి తెలియట్లేదు.

కష్టసాధ్యంగా దర్యాప్తు.. 
ఈ వాట్సాప్‌లను వాడి ప్రముఖులు, అధికారుల ఫొటోలు డీపీలుగా పెడుతున్న సైబర్‌ నేరగాళ్లు ఇంటర్నెట్‌ ద్వారా వారి సంబందీకుల ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. వాళ్లకు వారి బాస్‌లు, ప్రముఖుల మాదిరిగా వాట్సాప్‌ సందేశాలు పంపి డబ్బు, గిఫ్ట్‌ వోచర్లు డిమాండ్‌ చేసి కాజేస్తున్నారు. దీనిపై కేసులు నమోదవుతున్నా వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్‌ నంబరే దర్యాప్తునకు ఆధారంగా మారుతోంది.

అలా ముందుకు వెళుతున్న అధికారులకు దాని యజమానుల ఆచూకీ లభిస్తోంది తప్ప వాట్సాప్‌ యాక్టివేట్‌ చేసుకొని వినియోగిస్తున్న వారు పట్టుబడట్లేదు. వారిని కనిపెట్టడం కూడా కష్టంగా మారడంతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. ఆన్‌లైన్‌లో నగదు కాజేసిన కేసుల్లో నిందితులు దొరకడం అరుదు కాగా.. గిఫ్ట్‌ వోచర్ల రూపంలో కొల్లగొట్టిన వాళ్లు చిక్కడం దుర్లభమవుతోంది.

నేరుగా సంప్రదించడం ఉత్తమం.. 
వాట్సాప్‌ మోసాల బారినపడకుండా ప్రతి ఒక్కరూ కనీ స జాగ్రత్తలు తీసుకోవాలి. సందేశం వచ్చిన వెంటనే కేవలం డీపీ ఆధారంగా కాకుండా ఫోన్‌నంబర్‌ చూశా కే ఎదుటి వ్యక్తి ఎవరన్నది ఖరారు చేసుకోవాలి. అవసరమైతే ఫోన్‌ చేసి లేదా నేరుగా సంప్రదించాకే లావాదేవీలు చేయాలి.     – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement