
సాక్షి, సిటీబ్యూరో: చికెన్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. వేసవిలో ధరలు కాస్త తక్కువగా ఉన్నా.. వర్షాకాలం ప్రారంభంతో రికార్డు స్థాయికి చేరాయి. వారం పది రోజుల్లోనే చికెన్ ధర రిటైల్ మార్కెట్‌లో రూ.180 నుంచి రూ.280కి చేరింది. ఆదివారం హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో చికెన్ రూ.260 నుంచి రూ.280 పలకగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.300 వరకు పలికింది.
డిమాండ్‌కు తగిన సరఫరా లేక..
సాధారణంగా పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్లను పెంచుతారు. కానీ ఈ మధ్య కరోనా ప్రభావంతో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో గ్రేటర్ ప్రజల డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రతతో ఆశించిన స్థాయిలో కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరగడానికి కారణమంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ రైతులు రానున్న బోనాల సందర్భంగా కోళ్లను ఫాంలలోనే ఉంచి వారం పది రోజుల తర్వాత అమ్మితే మంచి ధర పలుకుతుందని సరఫరా తగ్గించారు. ఇలా సరఫరా తగ్గితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.