
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ నగల షాపులోకి చొరబడి భారీ చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాపు తెరిచిన ఐదు నిమిషాలకే(10.35 గం.ప్రాంతంలో) లోపలికి చొరబడ్డ ఓ ముఠా.. లాకర్ తాళాలు ఇవ్వాలంటూ గన్ చూపించి అసిస్టెంట్ మేనేజర్‌ను బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో.. కాల్పులకు దిగారు.
ఈ కాల్పుల్లో సిబ్బందిలోని సతీష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దాడి సమయంలో నగల షాపులోకి సీసీకెమెరాలను దొంగలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అయితే.. సిబ్బంది చాకచక్యంగా అందించిన సమాచారంలో పోలీసులు దుకాణం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ముఠా అక్కడి నుంచి పారిపోయింది.
దుండగులు ఆర్సీపురం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగల దుకాణంలోని వెండి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సీపీటీవీల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డయ్యాయి. మొత్తం పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీపీ అవినాష్ మహంతి ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాకు వివరాలను అందజేశారు.