గోదావరిలో జల సవ్వడి 

Huge Water In Godavari In the wake of the Kaleswaram Lift Irrigation - Sakshi

మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు నిండుకుండలా నీటినిల్వలు

పూర్తిస్థాయిలో నిండిన లోయర్‌ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, కడెం 

ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద.. 90 వేల క్యూసెక్కుల ప్రవాహాలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. మొన్నటి వరకు కొనసాగిన కాళేశ్వరం ఎత్తిపోతల నేపథ్యంలో గోదావరిలో జల సవ్వడి నెలకొంది. మేడిగడ్డ మొదలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్‌ వరకు బ్యారేజీలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి సైతం ప్రవాహాలు పెరిగాయి. ప్రస్తుత సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోయర్‌ మానేరు నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్‌ శాఖ సిద్ధమవుతోంది. 

అవసరాలకు తగ్గట్లు ఆయకట్టుకు.. 
జూన్‌ తొలి వారంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. జూన్‌ మూడో వారం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. ప్రాణహితలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 12 టీఎంసీల మేర నీటిని మేడిగడ్డ నుంచి దిగువ కొండపోచమ్మ వరకు తరలించింది. ప్రస్తుతం పంపులను పూర్తిగా నిలిపివేయగా మేడిగడ్డ వద్ద 55 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 25 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.50 టీఎంసీల మేర నిల్వ ఉండగా సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 6 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను సోమవారం 17.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండగా 15 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం ద్వారా ఇప్పటికే లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరును నింపారు.

లోయర్‌ మానేరులో 24 టీఎంసీలకుగాను 21.10 టీఎంసీలు నిల్వ ఉండగా 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇక్క డి నుంచి సూర్యాపేట వరకు ఎస్సారెస్పీ కాల్వల కింద నీటిని అందించేందుకు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్‌ శాఖ నిర్ణయించింది. మిడ్‌మానేరులో సైతం 25.87 టీఎంసీలకుగాను 23.34 టీఎంసీల నిల్వ ఉంది. ఇక మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయ డంతో మలక్‌పేట, రంగనాయక్‌సాగర్‌లలో మూడే సీ టీఎంసీల నిల్వలు ఉండగా 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌లో సైతం 6.80 టీఎంసీల నిల్వ ఉం ది. బ్యారేజీలు, రిజర్వాయర్‌లలో ఉన్న నీటితో అవసరాలకు తగ్గట్లుగా ఆయకట్టు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి  వస్తున్న వరదనీటి ఇన్‌ఫ్లో సోమవారం రాత్రి 9 గంటలకు 90 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం 1075.20 (40.203 టీఎంసీలు) అడుగులకు చేరింది.

సమ్మక్క బ్యారేజీ నుంచి 1.35 లక్షల క్యూసెక్కులు విడుదల
ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ గేట్లను ఇరిగేషన్‌ అధికారులు సోమవారం తెరిచారు. 59 గేట్లలో 36 గేట్లను తెరిచి లక్షా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 6.9 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.3 టీఎంసీలను నిల్వ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top