
సాక్షి, హైదరాబాద్: కాళేశ‍్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ చర‍్యలకి అవసరమైన డిజైన‍్ల తయారీకి నైపుణ్యం తమకు లేదని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్(సీఈసీడీఓ) విభాగం చేతులెత్తేయడం పట్ల ఆ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘బరాజ్‌ల నిర్మాణానికి డిజైన్లను సీఈ సీడీఓనే తయారు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకి శాఖలో సర్వోన్నత విభాగం సీఈ సీడీఓ. విభాగం సేవలు అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోకుండా బరాజ్‌ల పునరుద్ధరణకి డిజైన్ల తయారీని నిపుణులు/అత్యుత్తమ సంస్థలు/పరిశోధన విభాగాలకు అప్పగించాలని ఎలా కోరుతుంది?’ అని నీటిపారుదల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) సిఫారసుల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకి డిజైన్లను తయారు చేసే బాధ్యతకు సీఈ సీడీఓ విభాగం కట్టుబడి ఉండాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. శాఖలో డిజైన్ల తయారీకి నోడల్ ఏజెన్సీ కావడంతో ఈ బాధ్యతల నుంచి సీఈ సీడీఓ తప్పించుకోలేదని స్పష్టం చేసింది. అవసరమైతే సంబంధిత అంశాల నిపుణులు, సాంకేతిక సంస్థలను సంప్రదించి డిజైన్లు సరిగ్గానే ఉన్నట్టు ధ్రువీకరించుకోవచ‍్చని సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) తాజాగా సీఈఓ సీడీఓకు లేఖ రాశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడిన విషయం తెలిసిందే. బరాజ్‌లలోని లోపాలపై అధ్యయనం జరిపిన ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సమర్పించిన తుది నివేదికను గత ఏప్రిల్ 24న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా బరాజ్‌లలోని లోపాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించి వాటి ద్వారా అందే సమాచారం ఆధారంగా ఆయా బరాజ్‌ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించాల్సి ఉంది.
నిపుణుల కమిటీ నివేదిక అంది రెండు నెలలు గడిచినా బరాజ్‌ల పునరుద్ధరణ చర్యల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీఈ సీడీఓ తమ ఇంజనీర్లతో లేదా అత్యున్నత సంస్థల సహాయంతో బరాజ్‌ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తాజాగా ఈఎన్సీ(జనరల్) లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకి అవసరమైన డిజైన్ల ఆమోదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా నిర్దిష్ట గడువులు విధించుకుని ఈ పనులు పూర్తి చేయాలని సీఈ సీడీఓను ఆదేశించారు. డిజైన్ల తయారీకి అవసరమైన సాంకేతికసహాయం కోసం మరింత జాప్యం చేయకుండా తక్షణమే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించాలని స్పష్టం చేశారు.
బరాజ్‌ల డిజైన్లలో లోపాలను ఎత్తిచూపి వాటికి పరిష్కారాలను ఎన్డీఎస్‌ఏ సిఫారసు చేసిన నేపథ్యంలో ఆలోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత సీఈ సీడీఓ విభాగానికే ఉందని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఇతర సంస్థలపై డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీ బాధ్యతను తోసేయడానికి సీఈ సీడీఓ విభాగం కన్సల్టెంట్ కాదని, నీటిపారుదల శాఖలో అంతర్భాగమని గుర్తు చేసింది.
అలా అనడం అనుచితం..
బరాజ్‌ల డిజైన్లలో లోపాలను సరిదిద్దడానికి/ వాటి పునరుద్ధరణకి అవసరమైన ఇన్వెస్టిగేషన్లు నిర్వహణ, డిజైన్ల తయారీకి తమ సొంత నైపుణాన్ని వాడడానికి బదులుగా ఇలాంటి చర్యల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన అత్యున్నత సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహా‍్వనించాలని కోరుతూ సీఈ సీడీఓ లేఖ రాయడాన్ని నీటిపారుదల శాఖ అనుచితమని అభివర్ణించింది. ఒక వేళ నిపుణుల సహాయం అవసరమని భావిస్తే స్వయంగా చొరవ తీసుకుని ప్రపంచ స్థాయి నైపుణ్యం గల సంస్థలను నేరుగా సంప్రదించి తగిన సిఫారసులతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన బాధ్యత సీఈ సీడీఓపై ఉందని గుర్తు చేసింది. బరాజ్‌ల పునరుద్ధరణ విషయంలో సంస్థల నైపుణ్యాన్ని నిర్థారించే పరిజ్ఞానం సీఈ సీడీఓకే ఉంటుందని స్పష‍్టం చేసింది. ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానించి డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేయడం, వాటికి డిజైన్ల తయారీ అప్పగించడం, ఆ సంస్థలు ఇచ్చే డిజైన్లను ఆమోదించడం కోసం ఎంత సమయం పడుతుందో సీఈ సీడీఓ తెలియజేయలేదని తప్పుబట్టింది.
ఏడాదిగా కోరుతున్నా నామమాత్రంగా స్పందన
బరాజ్‌లలోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకి డిజైన్లు తయారు చేయాలని 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ 9 లేఖలు రాయగా, వాటికి సీఈ సీడీఓ నామమాత్రంగానే స్పందించిందని నీటిపారుదల శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఈ సీడీఓతో శాఖ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన 20కి పైగా లేఖలను రిఫరెన్స్‌గా పొందుపరిచింది. ఒక్కో లేఖలో శాఖ ఏం కోరింది? సీఈ సీడీఓ ఏం సమాధానం ఇచ్చింది? అనే విషయాలను తాజా లేఖలో పొందుపరిచి సీఈ సీడీఓ స‍్పందించిన తీరు బాగా లేదని తప్పుబట్టింది.