‘కాజీపేట’కు రెడ్‌సిగ్నల్‌! | Huge Troubles To Kazipet Mini Coach Factory | Sakshi
Sakshi News home page

‘కాజీపేట’కు రెడ్‌సిగ్నల్‌!

May 26 2025 12:58 AM | Updated on May 26 2025 12:58 AM

Huge Troubles To Kazipet Mini Coach Factory

రెండేళ్ల క్రితం ప్రధాని శంకుస్థాపన చేసిన కాజీపేట మినీ కోచ్‌ ఫ్యాక్టరీకి బాలారిష్టాలు

అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (మినీ కోచ్‌ ఫ్యాక్టరీ) దుస్థితి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్‌ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్‌ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్‌ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్‌లోనూ వందేభారత్‌ కోచ్‌ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. 

ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. 
ఈ యూనిట్‌ నిర్మాణ బాధ్యతను రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్‌ను ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాప్‌గా ప్రతిపాదించినప్పుడే ఆర్‌వీఎన్‌ఎల్‌ టెండర్లు పిలవగా పవర్‌మెక్‌–టైకిషాలతో కూడిన జాయింట్‌ వెంచర్‌ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్‌ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్‌ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్‌ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్‌ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్‌వీఎన్‌ఎల్‌ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్‌ ఇచ్చింది. 

కొర్రీలతో బ్రేకులు! 
కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్‌ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్‌వీఎల్‌ఎల్‌ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. 

ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్‌ లేఅవుట్‌ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement