Sakshi News home page

భారీగా విద్యుత్‌ డిమాండ్‌ 

Published Mon, Aug 14 2023 2:19 AM

Huge demand for electricity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. ఆగస్టు మొదటివారం నుంచి మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 31లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు లేక బోరుబావుల కింద ఉచిత విద్యుత్‌ బాగా వాడేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్దఎత్తున విద్యుత్‌ వినియోగిస్తున్నారు. దీంతో గతవారం రోజులుగా రాష్ట్రంలో రోజువారీ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 13వేల మెగావాట్లకు మించిపోయింది.

ఈ నెల 11న అత్యధికంగా 13,829 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. అదేరోజు జాతీయస్థాయిలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2,28,963 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వేసవిలో డిమాండ్‌ ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. గత నెలాఖరులో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో అప్ప ట్లో రోజువారీగా రాష్ట్రస్థాయిలో గరిష్ట విద్యుత్‌ డి మాండ్‌ 8వేల మెగావాట్లలోపు మాత్రమే నమోదైంది.

గత నెల 27న అయితే గరిష్ట డిమాండ్‌ ఏకంగా 6904 మెగావాట్లకు పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ త్వరలో 14వేల మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయని ట్రాన్స్‌కో యాజమాన్యం అంచనా వేస్తోంది.  

జల విద్యుదుత్పత్తిపై కరువు నీడలు 
కృష్ణా బేసిన్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 3000 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ప్రతి ఏటా తెలంగాణ జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1000 ఎంయూలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం, సాగర్‌ జలాశయాలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 97 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నిండాలంటే 166 టీఎంసీల వరద ఎగవ నుంచి రావాలి. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది.  

 రోజూ రూ.30 కోట్ల విద్యుత్‌ కొనుగోళ్లు 
ప్రస్తుతం జలవిద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో గరిష్ట డిమాండ్‌ నెలకొని ఉండే వేళల్లో నిరంతర విద్యుత్‌ కొనసాగించడానికి పవర్‌ ఎక్ఛ్సేంజీల నుంచి రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు పెద్దఎత్తున విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నాయి. రోజూ రూ.30 కోట్ల వ్యయంతో 60 ఎంయూల విద్యుత్‌ను ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు రోజువారీ విద్యుత్‌ కొనుగోళ్లు తీవ్ర భారంగా మారాయి. 

Advertisement

What’s your opinion

Advertisement