
అద్దె బకాయిలు చెల్లించని ఫంక్షన్ హాలు సీజ్ ేసేందుకు వెళ్లగా వివాదం
తోపులాటలో కిందపడిపోయిన అధికారి
కేసు నమోదు.. ఫంక్షన్ హాల్ సీజ్
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): మెహిదీపట్నంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధినిర్వహణలో భాగంగా ఓ ఫంక్షన్ హాలు వద్దకు వెళ్లిన తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు (52) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఫంక్షన్ హాలు నిర్వాహకులు, అధికారుల మధ్య వివాదం నేపథ్యంలో తోపులాట జరగ్గా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నడికుడ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఖాజా ఇసాక్‌ఉద్దీన్ అనే వ్యక్తి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ నుంచి మెహిదీపట్నంలోని ఓ కమ్యూనిటీహాల్‌ను లీజుకు తీసుకొని ఎంపీ గార్డెన్ పేరిట ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నాడు. కాగా గత 8 సంవత్సరాల నుంచి ఈ ఫంక్షన్ హాల్‌కు సంబంధించి హౌసింగ్‌బోర్డు సొసైటీకి అద్దె చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ.1.22 కోట్లు పేరుకుపోయాయి. వీటిని చెల్లించాలని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఎంపీ ఫంక్షన్‌హాల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు.
కోర్టు ఆదేశాల మేరకు..
చివరకు హౌసింగ్‌బోర్డు అధికారులు అద్దె బకాయిల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచి్చంది. కోర్టు ఆదేశాల మేరకు హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి ఆర్.జగదీశ్వర్‌రావు, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి శనివారం ఉదయం 7 గంటలకు మెహిదీపట్నం ఫంక్షన్‌హాల్ వద్దకు వెళ్లి సంబంధిత యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం మూడు గేట్లు ఉండగా ఒక గేటుకు తాళం వేశారు. మిగతా రెండు గేట్లకు తాళాలు వేస్తుండగా ఫంక్షన్‌హాల్ నిర్వాహకులు బౌన్సర్లతో కూడిన గుంపుతో వచ్చి హౌసింగ్‌బోర్డు సిబ్బందిపై దాడి చేశారు.
మిగతా గేట్లకు తాళం వేయకుండా కారును అడ్డంగా ఉంచడంతో అసిస్టెంట్ ఎస్టేట్ అధికారి జగదీశ్వర్‌రావు కోర్టు ఆదేశాల మేరకు తాము విధులు నిర్వహిస్తున్నామని, తమకు సహకరించాలని, ఏమైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని చెబుతుండగానే అతనిపైకి బౌన్సర్ల గుంపు వచ్చి చాతిపై చెయ్యివేసి తోసివేశారు. కిందపడిపోయిన జగదీశ్వర్‌రావు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోవడంతో తోటి సిబ్బంది అతడిని నానల్‌నగర్‌లోని ఒలివ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు అధికారులు ఫంక్షన్ హాలును సీజ్ చేశారు.