Honey Trapping: తియ్యని మాటలు.. కవ్వించే గొంతుతో రూ.కోటి కొట్టేసింది..

Honey Trap: Woman Cheating 2 Men Looted One Crore Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ అమ్మాయి తియ్యని గొంతుతో వేర్వేరుగా ఇద్దరితో మాట కలిపింది. టెలిగ్రామ్‌ వేదికగా కవ్వింపు మాటలు మాట్లాడి కోటీశ్వరులు అయ్యే ఉపాయం చెప్తానన్నది. ఇంకేముంది?..దీనికి అంగీకరించిన ఇద్దరి నుంచి సైబర్‌ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. ఒకరి నుంచి రూ.56 లక్షలు, మరొకరి నుంచి రూ.51 లక్షలు కాజేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు.

బంజారాహిల్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇటీవల టెలిగ్రామ్‌ వేదికగా ఓ అమ్మాయి పరిచయమయ్యింది. రెండురోజుల పాటు ఇద్దరూ చాటింగ్‌ చేస్తూ పరిచయాన్ని కాస్త స్నేహంగా మలుచుకున్నారు. తాను ఇన్వెస్టర్‌ని అంటూ నమ్మబలికింది. నాలా ఇన్వెస్ట్‌ చేయొచ్చు కదా అంటూ కోరింది. ఆమె మాటలకు బుట్టలో పడ్డ వ్యక్తి ఆమె చెప్పినట్లుగా ఇన్వెస్ట్‌ చేశాడు. తొలుత రెండు, మూడు పర్యాయాలు లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత సుమారు రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయించి ఒక్క రూపాయి లాభం ఇవ్వలేదు.

ఈ రూ.20 లక్షలు రావాలంటే మరికొంత కట్టాలన్నది. ఇలా ఆమె చెప్పినట్లు పలు దఫాలుగా రూ.52 లక్షలు వెచ్చించాడు. మెహదీపట్నంకు చెందిన 30 ఏళ్ల యువకుడికి ఇదే మాదిరిగా ఓ అమ్మాయి పరిచయమైంది. ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేయించింది. పలు దఫాలుగా యువకుడి నుంచి రూ.56 లక్షలు స్వాహా చేసింది.

ఈ ఇద్దరిదీ ఒకేరకమైన వలపు వల కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ముక్కూ మొహం తెలియని అమ్మాయి తియ్యగా మాట్లాడితే అన్ని లక్షలు ఎలా ఇస్తారంటూ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మందలించారు. వీరిద్దరి వేర్వేరు ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top