Hyderabad: వలపు వల హనీ ట్రాప్‌తో నిలువు దోపిడీ 

Honey Trap Gang Arrested in Hyderabad - Sakshi

అమాయకులను గుర్తించి యువతులతో ఎర 

వారితో మాటలు కలిపి చాటింగ్స్, ఫొటోలు 

వీటిని బాధితులకు చూపించిన బెదిరింపులు  

13 మందితో ఏర్పడిన ఈ ఘరానా ముఠా 

ఒక మహిళ మినహా మిగిలిన వారి అరెస్టు 

నిందితుల్లో ఓ మాజీ హోంగార్డు, బౌన్సర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఓ ప్రాంతానికి చెందిన చోటామోటా వ్యాపారుల్లో అమాయకులను ఎంచుకోవడం... యువతులతో వారికి ఎర వేసి ఫొటోల వరకు తీసుకువెళ్లడం... వాటితో యువతుల బంధువులుగా రంగంలోకి దిగడం... దాడులు, బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దండుకోవడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న “హనీట్రాప్స్‌ బందిపోటు’ ముఠాను ముషీరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టైన 12 మందిలో ఓ మాజీ హోంగార్డు, బౌన్సర్‌ ఉన్నట్లు మధ్య మండల డీసీపీ ఎం.రాజేష్‌ చంద్ర తెలిపారు. చిక్కడపల్లి ఏసీపీ ఎస్‌.యాదగిరితో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.  

హోంగార్డుగా పని చేస్తూ నేరాలు... 
ముషీరాబాద్‌ పరిధిలోని దయారా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ విఖార్‌ మెహ్దీ గతంలో నగర భద్రతా విభాగంలో హోంగార్డుగా పని చేశారు. 2013లో పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడీ, బెదిరింపులకు పాల్పడి జైలుకు వెళ్లాడు. 2016లో నోట్ల రద్దు తర్వాత పాత నోట్లకు కొత్త నోట్లు మార్పిడి పేరుతో దందా చేసి పలువురిని మోసం చేశాడు. దీనిపై చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. విఖార్‌ జైల్లో ఉండగా తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌తో పరిచయమైంది. వీళ్లిద్దరూ కలిసి పంజగుట్టలో విఖార్‌తో కలిసి అరెస్టు అయిన సంతోష్‌నగర్‌ వాసి మహ్మద్‌ కలీం ఖాన్, ముషీరాబాద్‌కు చెందిన పాత నేరగాడు, విఖార్‌ సోదరుడైన సిరాజ్‌ జట్టు కట్టారు. పహాడీషరీఫ్, మెహదీపట్నం ప్రాంతాలకు చెందిన షేక్‌ సమీర, సైదా ఫాతిమా, మహ్మద్‌ ఇస్మాయిల్, అలీ, మజీద్‌ అహ్మద్, అహ్మద్‌ రిజ్వాన్, సయ్యద్‌ రఫీఖ్, షేక్‌ బషీర్, స్టేజ్‌ డ్యాన్సర్‌ హీనాలతో ముఠా ఏర్పాటు చేశారు.  

చిరు వ్యాపారులను ఎంపిక చేసుకుని... 
ఈ గ్యాంగ్‌లోని పురుషులు తమ ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల్లో అమాయకులను టార్గెట్‌గా చేసుకుంటారు. వీరి ద్వారా విషయం తెలుసుకునే ముఠాలోని యువతులు, మహిళలు అతడి వద్దకు వెళ్తారు. ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వడానికంటూ వ్యాపారుల ఫోన్‌ నెంబర్లు తీసుకుంటారు. ఆపై వారికి వాట్సాప్‌లో సందేశాలు పంపి చాటింగ్స్‌ చేస్తారు. ఓ ప్రాంతంలో కలుసుకోవడానికి రమ్మని పిలిచి వారితో ఫొటోలు దిగుతారు. ఈ ఫొటోలను తీసుకుని ముఠా సభ్యులు అసలు కథ మొదలెడతారు. ఆ వ్యాపారి వద్దకు వెళ్లి సదరు మహిళ తమ భార్య లేదా కాబోయే భార్య అని చెప్పి, ఆమెను లోబరుచుకుంటున్నావని బెదిరించి దాడి చేస్తారు. పోలీసులుగా ఎంట్రీ ఇచ్చే విఖార్, ఇమ్రాన్‌లు కేసుల పేరుతో, విలేకరి రూపంలో వచ్చే రిజ్వాన్‌ ఫొటోలు మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తాడు. దీంతో వారు సదరు వ్యక్తి నుంచి భారీ మొత్తం డిమాండ్‌ చేసి అందినకాడికి దండుకుంటారు.  

మూడు ఠాణాల్లో నాలుగు కేసులు... 
ఈ ఏడాది జూన్‌ నుంచి నేరాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌పై ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, సంతోష్‌నగర్, ముషీరాబాద్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌కు చెందిన ఖమ్రుద్దీన్‌ను రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక అతడు తన ఇంటిని తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఇదే ప్రాంత వాసి ఖలీల్‌ పాషా రూ.2.5 లక్షలు మరో ఇద్దరి నుంచి ఇంకొంత రాబట్టారు. ఇలా మొత్తం రూ.8.5 లక్షలు కాజేసిన, బెదిరింపులకు డమ్మీ పిస్టల్స్, కత్తులు వాడే వీరిపై ముషీరాబాద్‌లో బందిపోటు దొంగతనం సహా వివిధ ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లి ఏసీపీ ఎస్‌.యాదగిరి నేతృత్వంలో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు హీనా సహా మిగిలిన 12 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, రెండు డమ్మీ తుపాకులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. వీరిలో అర్హులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని, వీరి బారినపడిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని డీసీపీ రాజేష్‌ చంద్ర కోరారు.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top