Hitech Prostitution Racket Busted by Hyderabad Police - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్‌

Apr 21 2022 10:56 AM | Updated on Apr 22 2022 11:54 AM

Hitech Prostitution Racket Busted by Hyderabad Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం గుట్టురట్టు చేసిన విదేశీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు హైటెక్‌ పద్దతిలో దందా చేస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడితో పాటు ఉగాండా జాతీయురాలు, విటుడిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై పీటా యాక్ట్‌తో పాటు విదేశీయురాలిపై పాస్‌పోర్ట్, ఫారెనర్స్‌ యాక్ట్‌ కిందా కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మరో ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు.
 
కీలకంగా వ్యవహరిస్తున్న విదేశీయుడు... 
విజిట్‌ వీసాపై వచ్చి పుప్పాలగూడలోని ఫ్రెండ్స్‌ కాలనీలో నివసిస్తున్న ఓ ఉగాండా జాతీయుడు, స్థానిక వ్యక్తితో కలిసి తమ ఫ్లాట్‌లోనే వ్యభిచార కేంద్రం ఏర్పాటు చేశాడు. సదరు ఉగాండా జాతీయుడు తమ దేశానికి చెందిన మహిళలు, యువతులను విజిట్‌ వీసాపై టూరిస్టుల మాదిరిగా రప్పిస్తున్నాడు. ఆపై వీరి ఫొటోలను డేటింగ్‌ యాప్స్‌లో పొందుపరుస్తున్నాడు. వీటిని చూసి ఆకర్షితులైన వారు సదరు యాప్‌ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. అలాంటి వారికి నిర్వాహకుడు సూచించిన వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చే యువతి అతడితో చాటింగ్‌ చేస్తుంది. ఇదే వాట్సాప్‌ను వాట్సాప్‌ వెబ్‌ ద్వారా నిర్వాహకుడు, మధ్యవర్తి గమనిస్తుంటారు. 

గూగుల్‌ పే ద్వారా చెల్లింపుల తర్వాత... 
విటుడితో చాటింగ్, బేరసారాల అనంతరం రేటు ఖరారవుతుంది. ఈ మొత్తాన్ని విటుడు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా చెల్లిస్తూ ఆ స్క్రీన్‌ షాట్‌ను వాట్సాప్‌ ద్వారానే యు వతికి పంపిస్తాడు. దీనిని పర్యవేక్షించి మిగిలిన ఇద్దరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత సదరు యువతి తమ ఫ్లాట్‌ లోకేషన్‌ను విటుడికి షేర్‌ చేస్తుంది. దీనిని వేర్వేరు వ్యక్తులకు షేర్‌ చేసే అవకాశం లేకుండా లాక్డ్‌ లోకేషన్‌ షేర్‌ చేస్తూ, అది కేవలం ఒకరికి మాత్రమే ఓపెన్‌ అయ్యేలా సెట్‌ చేస్తున్నారు ఆ నిర్వాహకులు. లోకేషన్‌ను అన్‌లాక్‌ చేయడానికి ఉపకరించే కోడ్‌ను విడిగా వాట్సాప్‌లో విటుడికి పంపిస్తున్నారు.  

కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా... 
అలా వ్యభిచార గృహం నడిచే ఫ్లాట్‌కు విటుడు చేరుకుంటున్నాడు. ఫ్రెండ్స్‌ కాలనీ కేంద్రంగా కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా దందా నడుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. ఫ్లాట్‌ నుంచి విటుడు తిరిగి వెళ్లేప్పుడు అతడి ఫోన్‌ తనిఖీ చేసే యువతి అందులోని తమ చాటింగ్‌తో పాటు నంబర్‌ను డిలీట్‌ చేస్తోందని పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు.

చదవండి: వనపర్తిలో మరో ‘సర్‌ప్రైజ్’ ఘటన.. ఈసారి భర్త ‘బలి’

Advertisement
 
Advertisement
Advertisement