Telangana: తప్పటడుగుల ఇంటర్‌ బోర్డుకు చికిత్స! | High Level Expert Committee for Telangana Intermediate Board Reformation | Sakshi
Sakshi News home page

Telangana: తప్పటడుగుల ఇంటర్‌ బోర్డుకు చికిత్స!

Sep 29 2022 3:30 PM | Updated on Sep 29 2022 3:30 PM

High Level Expert Committee for Telangana Intermediate Board Reformation - Sakshi

పరీక్షల నిర్వహణలో ఏటా అబాసుపాలవుతున్న ఇంటర్మీడియెట్‌ బోర్డును చక్కబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షల నిర్వహణలో ఏటా అబాసుపాలవుతున్న ఇంటర్మీడియెట్‌ బోర్డును చక్కబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. లోపాలను సరిచేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలో నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది.

ఇంటర్‌ బోర్డు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నవీన్‌ మిత్తల్‌కు కార్యాచరణ అప్పగించే అవకాశముందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. బోర్డులో అంతర్గతంగా ఉన్న సమస్యలు, నియంత్రణ వ్యవస్థ లోపించడం, సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం కారణంగా కొన్నేళ్లుగా ఇంటర్‌ పరీక్షల్లో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కారణాలను అన్వేషించి, తప్పులు జరగకుండా పకడ్బందీగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూడేళ్లుగా తప్పిదాలే...

  • 2019 మార్చిలో జరిగిన ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో తప్పులొచ్చినట్టు గుర్తించారు. వీటిని సరిచేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
     
  • 2020 మార్చిలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నపత్రంలో భారీగా తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫెయిలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, కరోనా రావడం, సప్లిమెంటరీ పెట్టలేకపోవడంతో ఫెయిలైన వారందరినీ పాస్‌ చేశారు.
     
  • 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగానే రెండో ఏడాది మార్కులను నిర్ధారించారు. ఫస్టియర్‌ విద్యార్థులకు రెండో సంవత్సరానికి అనుమతించారు. కానీ 2021 అక్టోబర్‌లో రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఫస్టియర్‌ పరీక్షలు పెట్టారు. ఇందులో 49% ఉత్తీర్ణత రావడం, ఆందోళనతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా రాజకీయ రంగు పులుముకోవడంతో కనీస మార్కులతో అందరినీ పాస్‌ చేశారు. 
     
  • ఇటీవల జరిగిన ఇంటర్‌ పరీక్షల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఒకచోట సంస్కృతం సబ్జెక్టులో మూడు ప్రశ్నలు రిపీట్‌ అయ్యాయి. జనగామలో సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రంలో పొరపాట్లు దొర్లాయి. పొలిటికల్‌ సైన్స్‌ హిందీ మీడియం ప్రశ్నపత్రం ముద్రించకుండా, చేతిరాతతో అప్పటికప్పుడు ఇవ్వడం విద్యార్థులను కలవరపెట్టింది. ఇలా ప్రతీ ఏటా పరీక్షల నిర్వహణ తలనొప్పిగా మారుతోంది.

సమూల మార్పులే శరణ్యమా?
పరీక్ష నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బోర్డుపై వస్తున్న ఆరోపణలకు చెక్‌ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని పరిశీలన కమిటీకి అప్పగించే వీలుంది. దీంతోపాటే పరీక్ష కేంద్రాలను, ఇన్విజిలేటర్లను పెంచడం, జిల్లాస్థాయి నుంచే బాధ్యతాయుతంగా పనిచేసే యంత్రాంగాన్ని నియమించడం వంటి చర్యలూ తీసుకోవాలని భావిస్తున్నారు. (క్లిక్: వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement