పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వు చెల్లదు | High Court quashes trial court orders on newspapers | Sakshi
Sakshi News home page

పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వు చెల్లదు

Jun 4 2025 1:15 AM | Updated on Jun 4 2025 1:15 AM

High Court quashes trial court orders on newspapers

ట్రయల్‌ కోర్టు ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: పత్రికల గొంతు నొక్కేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం చెల్లదని హైకోర్టు అభిప్రాయపడింది. జాతీయ భద్రతతోపాటు ఇతర కొన్ని ప్రమాదకర సందర్భాల్లో మాత్రమే గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. 2022లో ఓ వెబ్‌సైట్, యూట్యూబ్‌ చానల్‌పై ట్రయల్‌ కోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వును కొట్టేసింది. తమకు వ్యతిరేకంగా అవమానకరమైన, అపవాదు తీసుకొచ్చేలా ఓ వెబ్‌సైట్‌లో వీడియోలు, చిత్రాలు, నివేదికలు, ప్రచురణలు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించడాన్ని, ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించింది. 

ట్రయల్‌ కోర్టు మేఘాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022 డిసెంబర్‌ 2న కూకట్‌పల్లి కోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్‌ అర్డర్‌ను సవాల్‌ చేస్తూ వెబ్‌సైట్, యూట్యూబ్‌ నిర్వాహకులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకొనేలా ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ), 19 (1) (జీ)లను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ టి.వినోద్‌కుమార్, జస్టిస్‌ పి. శ్రీసుధ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ట్రయల్‌ కోర్టు జారీ చేసిన అభ్యంతరకరమైన ఉత్తర్వును కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement