DSC 2008: మిగిలిన ఖాళీల్లో భర్తీ చేయండి  | Sakshi
Sakshi News home page

DSC 2008: మిగిలిన ఖాళీల్లో భర్తీ చేయండి 

Published Fri, Sep 30 2022 3:19 AM

High Court Order To Telangana Govt On DSC 2008 Candidates Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ–2008లో 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2008 నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఖాళీల్లో ఇంకా భర్తీ చేయకుండా మిగిలిన వాటిని మెరిట్‌ ఆధారంగా బీఈడీ చేసిన అభ్యర్థులతో భర్తీ చేయమని స్పష్టం చేసింది. ఇందులో తెలంగాణలో దాదాపు 1,800 పోస్టులను భర్తీ చేయమని చెప్పింది.

30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించడం సరైనదా.. కాదా.. అనే అంశం జోలికి తాము వెళ్లడం లేదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ కె.శరత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌     ప్రభుత్వం 30,558 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నోటిఫికేషన్‌ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత మొత్తం పోస్టుల్లో 30 శాతం(10,200) డీఈడీ అభ్యర్థుల కోసమేనని రిజర్వు చేసింది.

ఈ మేరకు 2009, జనవరి 1వ తేదీన జీవో నంబర్‌ 28ని విడుదల చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బీఈడీ అభ్యర్థులు పి. ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు 69 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ కె.శరత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటినర్ల తరఫున న్యాయవాదులు బొబ్బిలి శ్రీనివాస్, ఎల్‌.రవిచంద్ర, జి.విద్యాసాగర్, బి.రచనారెడ్డి, ప్రతాప్‌నారాయణ్‌ సంఘి వాదనలు వినిపించారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం తరఫున గోవింద్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మొత్తం పోస్టుల్లో 3,500 పోస్టులను భర్తీ చేయలేదని గుర్తించింది. వీటిలో ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉపాధ్యాయులతో భర్తీ చేయగా, తెలంగాణలో ఇంకా ఖాళీలు మిగిలి ఉన్నాయంది. ఇలా మిగిలిన దాదాపు 1800 పోస్టులను 2008 అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది.   

Advertisement
Advertisement