బాణసంచాపై నిషేధం..

High Court Order Government Ban Fireworks Shops Across State Immediately - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను మూసేయించండి

కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మీదే

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదే శించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నవంబర్‌ 10–30 మధ్య బాణసంచా కాల్చకుండా నిషేధం విధించేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాశ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. బాణసంచా కాలిస్తే వాయుకాలుష్యం ఏర్పడుతుందని, శ్వాసకోశ సమస్యలు వచ్చి ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని ఇంద్రప్రకాశ్‌ వాదించారు.

ఈ నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలన్నారు. బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ), కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిచంగా ఆ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. బాణసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది.

రాత్రి 3 గంటల వరకు కూడా బాణసంచా కాలుస్తూ ధ్వని, వాయు కాలుష్యానికి పాల్పడుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని చెబుతానని, విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేయాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ అభ్యర్థించడంతో విచారణను వాయిదా వేసింది. అనంతరం బాణాసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ ప్రసాద్‌ నివేదించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు. 

వాయుకాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు
‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కరోనాతో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. వాయుకాలుష్యం ఏర్పడితే కరోనా రోగులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజస్థాన్‌ హైకోర్టు బాణసంచా కాల్చకుండా నిషేధం విధించింది. ఇతర హైకోర్టులు సైతం బాణసంచా కాల్చకుండా నిషేధం విధించాయి. బాణసంచా కాల్చి వాయు కాలుష్యానికి పాల్పడకుండా ప్రజలను చైతన్యం చేయండి. ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించండి’’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top