భారీ వర్షాలు : కేసీఆర్‌ కీలక ఆదేశాలు‌

Heavy Rains In Telangana KCR Review Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల నేడు (ఆదివారం) వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు.

ఏపీలోనూ భారీ వర్షాలు..
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని విశాఖ జిల్లాకు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top