హైదరాబాద్‌ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?

Heavy Rains: 68 Percentage More Rainfall than Normal In Hyderabad - Sakshi

పొంగి పొర్లుతున్న నాలాలు, లోతట్టు ప్రాంతాలు

ఇలాగే సెప్టెంబరు వరకూ కురవనున్న భారీ వర్షాలు 

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి ప్రారంభం నుంచి గ్రేటర్‌ను కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. సీజన్‌ ప్రారంభమైన జూన్‌ 1 నుంచి ఈ నెల 12 వరకు సరాసరిన 68 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో సాధారణం కంటే ఏకంగా 50 నుంచి 80 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. ఈ సీజన్‌ ముగిసే సెప్టెంబరు చివరి నాటికి వర్షపాతం మరింత అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే అధిక వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ సహా హుస్సేన్‌సాగర్‌తో పాటు చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి.

నాలాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీల వాసులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. పలు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. గ్రేటర్‌ పరిధిలో ఇప్పటివరకు (జూన్‌ ఒకటి నుంచి జూలై 12 వరకు) సాధారణంగా 161.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవడం పరిపాటే. కానీ ఈసారి ఏకంగా 270.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 68 శాతం అధికమన్నమాట. ఇక తిరుమలగిరి మండలంలో ఏకంగా 115 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో 84 శాతం, బహదూర్‌పురాలో 76, బండ్లగూడలో 78 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ లెక్కలు చెబుతున్నాయి. 
చదవండి: జలుబు లాగే కరోనా

వరద నీరు ఇంకే దారేదీ? 
కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన గ్రేటర్‌ సిటీలో కురిసిన వర్షపాతంలో సుమారు 80 శాతం రహదారులపై ప్రవహించి నాలాలు, చెరువులు, కుంటలు.. అటు నుంచి మూసీలోకి చేరుతోంది. వర్షపాతాన్ని నేలగర్భంలోకి ఇంకించేందుకు ఇళ్లు, కార్యాలయాలు, భవనాలు, పరిశ్రమల్లో చాలినన్ని ఇంకుడు గుంతలు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. దీంతో సీజన్‌లో కుండపోత వర్షాలు కురిసినప్పటికీ వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని భూగర్భ జలశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లోనే ప్రతి భవనానికీ ఉన్న బోరుబావికి ఆనుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

జలదిగ్బంధంలో అల్లంతోట బావి కాలనీ.. 
సనత్‌నగర్‌: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బేగంపేట లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అల్లంతోట బావి రహదారులు నీట మునగటంతో జనం ఇళ్లలోనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు పాంటలూన్స్‌ వైపు నుంచి మరో వైపు మయూరి మార్గ్‌ నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో గత నాలుగు రోజులుగా అల్లంతోట బావి జలదిగ్భందంలో చిక్కుకు పోయింది. వరదనీరు బయటకు వెళ్లలేక పోవటంతో కొత్తగా వచ్చే వర్షపు నీటితో ముంపు సమస్య తీవ్రమవుతోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top