
కాళేశ్వరం ఘాట్ వద్ద 10.690 మీటర్ల ఎత్తులో నీటిమట్టం
మేడిగడ్డ బరాజ్ వద్ద 6.36 లక్షల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో
చింతలమానెపల్లి/కాళేశ్వరం/ ఆసిఫాబాద్/ములకలపల్లి: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, ఉప నదుల వరదల కారణంగా ప్రాణహిత నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకేలా ప్రాణహిత ప్రవహిస్తోంది. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు అప్రమత్తం చేశారు. మండలంలోని దిందా వాగులో పడి కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వాగు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో నది దాటేందుకు ప్రయత్నించి పట్టు తప్పాడు. ఈ క్రమంలో గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా కొమ్మ విరిగి వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు.
సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావుపేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనను ఆనుకొని పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి.
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద...
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.690 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరి«ధిలోని మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవా హం 6.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రూపంలో వస్తోంది. బరాజ్ 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో 6.36 లక్షల క్యూసె క్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు.
కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గురువారం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 850 క్యూసెక్కులు ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 880 దిగువకు వదులుతున్నారు.
‘సీతారామ’ప్ర«దానకాల్వ కట్టకు కోత
సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐ) ప్రధాన కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే.రామవరంలోని సీతారామ పంప్‌హౌస్–2 నుంచి కమలాపురం వద్ద గల పంప్‌హౌస్–3 వరకు వెళ్లే ప్రధాన కాల్వకు భారీ గొయ్యి ఏర్పడింది. వర్షాల «నేపథ్యంలో వరద ఉ«ధృతికి క్రమేపీ కోత పెరుగుతోంది.