
నెలలు నిండని శిశువుకు గుండె సమస్య
బాబుకు అత్యాధునిక డివైస్ తో పీడీఏ మూసివేత
ఈ డివైస్ తో చికిత్స పొంది కోలుకున్న అతి తక్కువ బరువుగల శిశువుగా రికార్డు
శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసిన కిమ్స్ గుండెవైద్యులు
కంటికి రెప్పలా కాపాడిన ఎన్ఐసియు బృందం
హైదరాబాద్: ఏడు నెలలకే.. అంటే నెలలు నిండకముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అతడికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో, శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నియోనాటాజిస్ట్ డా. భవాని దీప్తి మరియు కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ తెలిపారు.
“నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన దంపతులకు నెలలు నిండకముందే ఏడు నెలలకే ఒక బాబు పుట్టాడు. దీంతో అత్యవసర పరిస్థిత్తుల్లో 97 రోజుల పాటు బాబును ఎన్ఐసియూ లో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో ఊపిరితిత్తుల నుండి రక్తం రావడం మరియు గుండె సంబంధిచిన పీడిఏ సమస్య వల్ల వెంటి లేటర్ అవసరం పడింది.
తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు, మిగిలిన శరీరానికి, రక్త సరఫరా చేసే రక్తనాళాలకు మధ్య ఒక గొట్టం లాంటిది ఉంటుంది. పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో అది మూసుకుపోతుంది. కానీ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అది మూసుకోవడం కష్టం అవుతుంది. దీనినే పీడిఏ అంటారు. ఈ సమస్య వల్ల ఊపిరితిత్తులకు రక్తం ఎక్కువగా వెళ్లి ఒత్తిడి పెరుగుతుంది. గుండె పనితీరు దెబ్బతింటుంది. నెలలు నిండని శిశువుల్లో 80% మందికి ఈ తరహా సమస్య ఉంటుంది. అప్పుడు ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, గుండె కూడా దెబ్బతినడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది.
ఈ సమస్యకు ముందుగా మందులు వాడి చూస్తారు. వాటితో నయమైతే పర్వాలేదు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స గానీ, ఇలాంటి డివైస్ తో మూసేయడం గానీ చేయాలి. లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఇంతకాలం ఎదభాగానికి ఒక పక్క నుంచి శస్త్రచికిత్స చేసి ఆ రంధ్రాన్ని మూసేసేవారు. కానీ, ఈ కేసులో బాబు అతి తక్కువ బరువు ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో శస్త్రచికిత్స చేయడం అంత సురక్షితం కాదని భావించాం. అందుకే అత్యాధునిక పరికరంతో ఆ రంధ్రాన్ని మూసేయాలని నిర్ణయించాం. సర్జరీ చేసే సమయానికి అతడి బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే ఉన్నాడు.
1.2 మిల్లీమీటర్లు చుట్టుకొలత ఉన్న పికోలో అనే అత్యాధునిక పరికరాన్ని కాలి నరం ద్వారా లోపలకు పంపి, దాని సాయంతో రంధ్రాన్ని మూసేశాం. ఈ డివైస్ అమర్చి కోలుకున్న శిశువుల్లో దేశంలోనే అతి తక్కువ బరువు గల చిన్నారిగా రికార్డు సృష్టించాడు. దీంతో రంధ్రం పూడుకుపోయి, బాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యాయి. ఈ ప్రొసీజర్ తర్వాత ఎన్ఐసీయూలో డాక్టర్ భవానీ దీప్తి, డాక్టర్ సింధు మారు బృందం బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
శస్త్రచికిత్స అవసరం లేకుండానే పీడీఏ మూయడానికి ఈ పరికరం గేమ్‌ఛేంజర్ అవుతుంది. బాబుకు ఇక ఎలాంటి సమస్యలు లేకపోవడంతో పాలు కూడా తాగడం మొదలుపెట్టాడు. తర్వాత 2.45 కిలోలకు బరువు పెరగడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ భవనీ దీప్తి మరియు డా.సుదీప్ వర్మ వివరించారు.