జన్యుమార్పులతోనే గుండెజబ్బుల ముప్పు?

Heart Disease Risk Due To Genetic Mutations - Sakshi

భారతీయుల్లో అత్యధిక మందికి డైలేటెడ్‌ కార్డియో మయోపతి 

సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: చిన్న వయసులోనివారు, రోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వాళ్లు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలడం గురించి మనం వింటుంటాం. విన్న ప్రతిసారీ మన మెదళ్లలో మెదిలే ఓ ప్రశ్న.. ఎందుకలా? అని! హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పాశ్చాత్యదేశాల వారితో పోలిస్తే మన దేశ జనాభాలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు ప్రధాన కారణం మన జన్యువుల్లో ఉండే ప్రత్యేకమైన మార్పులే! గుండె కండరాల అంతర నిర్మాణాన్ని మార్చేసే కార్డియో మయోపతి ఉంటే.. ఉన్నట్టుండి గుండె పనిచేయడం ఆగిపోయే అవకాశాలు ఎక్కువవుతాయి.

సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ ఈ కార్డియో మయోపతికి గల కారణాలను అన్వేషించేందుకు పరిశోధనలు చేపట్టారు. బీటా మయోసిన్‌ హెవీఛెయిన్‌ జన్యువు (–ఎంవైహెచ్‌7)లోని కొన్ని వినూత్నమైన జన్యుమార్పుల వల్ల భారతీయుల్లో అధికులకు డైలేటెడ్‌ కార్డియో మయోపతి వస్తున్నట్లు గుర్తించారు. కెనడియన్‌ జర్నల్‌ ఆఫ్‌ కార్డియాలజీలో ఈ తాజా పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

మారిన అమైనోయాసిడ్లు 
ప్రపంచవ్యాప్తంగానూ ఈ ఎంవైహెచ్‌7కు, గుండెజబ్బులకు సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే నిరూపణ అయ్యింది. అయితే భారతీయ కార్డియో మయోపతి రోగులపై ఇందుకు సంబంధించిన జన్యు పరిశోధనలు ఏవీ జరగలేదని డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము దాదాపు 137 మంది డైలేటెడ్‌ కార్డియో మయోపతి రోగులను ఎంపిక చేసుకుని వారిలోని ఎంవైహెచ్‌7 జన్యువు తాలూకు క్రమాన్ని నమోదు చేశామని, వీరితోపాటు ఇంకో 167 మంది ఆరోగ్యకరమైన వారిలోనూ ఈ జన్యుక్రమాన్ని నమోదు చేసి పోల్చి చూశామని వివరించారు.

‘సుమారు 27 తేడాలు, ఏడు మార్పులు వినూత్నంగా కనిపించాయి. భారతీయ డైలేటెడ్‌ కార్డియో మయోపతి రోగుల్లో మాత్రమే ఇవి కనిపించాయి. జన్యుమార్పుల్లో ప్రొటీన్‌లో తప్పుడు అమైనోయాసిడ్‌లు ఉండే మిస్‌సెన్స్‌ మ్యుటేషన్స్‌ నాలుగు ఉన్నాయి. ఈ నాలుగూ ఎంవైహెచ్‌7 జన్యువులో యుగాలుగా కొనసాగుతూ వచ్చిన అమైనోయాసిడ్లను మార్చేశాయి.

మారిపోయిన అమైనోయాసిడ్లు వ్యాధులకు కారణమవుతాయని బయో ఇన్ఫర్మేటిక్స్‌ ద్వారా తెలిసింది’అని వివరించారు. గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి జన్యుమార్పిడి టెక్నాలజీల ద్వారా రక్షణ కల్పించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top