దళితబంధుపై తీర్పు రిజర్వు

HC Verdict Reserves Dalita Bandhu EC Stopped Petition - Sakshi

ఈసీ ఉత్తర్వులు కొట్టివేయాలన్న పిటిషనర్లు 

నిలిపివేసే అధికారం ఉందన్న ఈసీ న్యాయవాది 

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పరిధి దాటి ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని రాష్ట్ర హైకోర్టును పిటిషనర్లు కోరారు. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లతో పాటు ఉపఎన్నిక అయ్యే వరకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. దళితబంధుపై ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేత జడ్సన్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. దళితబంధును నిలిపివేయాలన్న ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని లక్ష్మయ్య, జడ్సన్‌ న్యాయవాదులు రఘునాథ్, శరత్‌కుమార్‌ నివేదించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ కంటే ముందే ఈ పథకం అమలులో ఉందని, ఈ పథకాన్ని ఆపడంతో వెనుకబడిన వర్గాలు ఇబ్బందిపడే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదలతో నష్టపోయిన వారిలో కొందరికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారని, ఎన్నికల తర్వాత నిలిపివేశారని వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ తరఫు న్యాయవాది శశికిరణ్‌ నివేదించారు. హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడం అనుమానమేనన్నారు. హుజూరాబాద్‌లో పైలె ట్‌ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు నివేదించారు.

ఇదిలాఉండగా పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నిక ముగిసే వరకూ పథకం అమలును ఆపాలని ఉత్తర్వులు జారీచేశామని ఈసీ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. ఇలా నిలిపివేసే అధికారం ఈసీకి ఉందని నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top