ఏడేళ్ల తర్వాత సవాల్‌ చేస్తారా? | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత సవాల్‌ చేస్తారా?

Published Sat, May 18 2024 5:15 AM

HC Dismisses Harish Rao Plea on Land Allotment to Anand Cine Services

భూ కేటాయింపు పిటిషన్‌లో హరీశ్‌రావును తప్పుబట్టిన హైకోర్టు 

2008లో నాటి ప్రభుత్వం ఇచ్చిన జీవో సమర్థనీయమేనని వ్యాఖ్య  

సాక్షి, హైదరాబాద్‌: పలు ఫిల్మ్‌ సిటీలకు ప్రభుత్వ భూ కేటాయింపు సమర్థనీయమైనప్పుడు.. ఆనంద్‌ సినీ సర్వీసెస్‌కు ఇవ్వడం తప్పెలా అవుతుందని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్‌రావును హైకోర్టు ప్రశ్నించింది. అలాగే 2001లో తొలిసారి జీవో జారీ చేస్తే.. 2008లో సవాల్‌ చేయడం సరికాదని, ఆలస్యానికి కారణాలు కూడా తెలుపలేదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్స్‌ కనిపించనందున కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. 2001, ఆగస్టు 21న సాధారణ పరిపాలన (ఐఅండ్‌పీఆర్‌) విభాగం జీవో 355ను జారీ చేసింది. 

హైదరాబాద్‌ షేక్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 403లో 5 ఎకరాల భూమిని ఆనంద్‌ సినీ సర్వీసెస్‌కు ఎకరం రూ.8,500లకు కేటాయించాలని ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌డీసీ)కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎందుకో భూమి అప్పగింతను నిలిపివేస్తూ ప్రభుత్వం ఏపీఎస్‌ఎఫ్‌డీసీకి లేఖ రాసింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక డిసెంబర్, 2008లో మరో జీవో 744ను జారీ చేసి.. భూమిని అప్పగించింది. ఈ రెండు జీవోలను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు 2008లో పిటిషన్‌ దాఖలు చేశారు. భూ కేటాయింపు చట్టవిరుద్ధమని, జీవోలను కొట్టివేయడంతో పాటు ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీఎస్‌ఎఫ్‌డీసీకి 1982లో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అలాగే పద్మాలయా స్టూడియోకు 9.5 ఎకరాలు, సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు 5 ఎకరాలతో పాటు ఆనంద్‌ సర్వీసెస్‌కు కూడా 5 ఎకరాలు కేటాయించారు. దీన్ని సవాల్‌ చేస్తూ 2004లో దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఇది సినీ రంగ అభివృద్ధికి 1982లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన పాలసీ. 2011లోనూ పలు పిటిషన్లు డిస్మిస్‌ అయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు దర్శకుడు ఎన్‌.శంకర్‌కు 5 ఎకరాల కేటాయింపును ఇదే హైకోర్టు సమర్థించింది’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత పిటిషన్‌ వేయడం సరికాదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం విచక్షణాధికారాన్ని వినియోగించుకుని జాప్యానికి కారణం లేనందున ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement