‘ఆటో’మేటిక్‌గా బతుకు‘చక్రం’ తిరిగింది

Harish Rao Started Auto Workers Cooperative Credit Union - Sakshi

రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మిక సహకార పరపతి సంఘం ఏర్పాటు

నేడు పరపతి సంఘాన్ని ప్రారంభించనున్న మంత్రి 

సాక్షి, సిద్దిపేట : అందరి జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ ఆటో కార్మికులనూ కుదేలుచేసింది. కుటుంబపోషణకు దాతల సాయం కోసం ఎదురుచూసే పరిస్థితిలోకి నెట్టేసింది. వారి కుటుంబాల దయనీయస్థితిని పరిశీలించిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. వారికి జీవితాలపై భరోసా కల్పించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయించి ఆర్థికంగా అండగా నిలిచారు.  ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేనందున మూలధనం కోసం మంత్రి తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని సంఘంలో జమచేయించారు. సంఘాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, లైసెన్స్, జత యూనిఫాం అందించనున్నారు. చదవండి: మ్యారేజ్‌ బ్యూరో: ఇక్కడ వ్యవసాయం చేసే వారికే పెళ్లిళ్లు..

మంత్రి మాటతో ఏకతాటిపైకి..
కరోనా తదనంతరం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జిల్లావ్యాప్తంగా గల 855 మంది ఆటో కార్మికులు మంత్రి సూచనతో.. సహకార పరప తి సంఘంగా ఏర్పడాలనే అభిప్రాయానికొచ్చా రు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆటో కార్మికుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం విధివిధానాలపై అధికారులను కలవగా.. పరపతి సంఘం ఏర్పాటు, రుణాల మంజూరుకు మూలధనం అవసరమని చెప్పా రు. దీంతో సభ్యులు ఒక్కొక్కరు తమ వాటాధనంగా రూ.1,110 చొప్పున రూ. 8,55,000 జమ చేశారు. సంఘం ఏర్పాటు, రిజిస్ట్రేషన్, ఇతర ఖర్చులకు రూ.55 వేలు వినియోగించారు. అయితే మిగిలిన మొత్తం మూలధనంగా సరిపోదని తెలిసి దిగాలుపడ్డారు.

మంత్రి ఇంటి స్థలం తనఖా పెట్టి.. 
ఆటోడ్రైవర్లంతా మంత్రి హరీశ్‌రావును కలిసి విషయం చెప్పారు. స్పందించిన మంత్రి.. ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేదని గుర్తించారు. వెంటనే సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో గల తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.45 లక్షలు అప్పు తీసుకొని పరపతి సంఘంలో జమచేయించారు. ఇలా మొత్తం రూ.53 లక్షల మూలధనంతో పరపతి సంఘం ఏర్పాటైంది. దీంతోపాటు తన మిత్రుల సహకారంతో 666 మంది ఆటోకార్మికులకు రూ. 2లక్షల చొప్పున బీమా కోసం ప్రీమియం కూడా చెల్లించారు. సిద్దిపేట డీటీవోతో మాట్లాడి అందరికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు ఇప్పించారు. 

సంఘం నిర్వహణకు ప్రణాళిక
పరపతి సంఘం నిర్వహణకు రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి, డాక్టర్, అకౌంటెంట్‌తో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. నెలవారీ పొదుపు, రుణాల మంజూరు వంటివి ఇది చూసుకుంటుంది. సభ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినా, పెళ్లయినా సంఘం నుంచి రూ. 5వేలు అందిస్తారు. సభ్యులకు నైతిక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబపోషణ, పిల్లల చదువులు, ఆటోల్లో ప్రయాణించే వారితో మర్యాదగా నడుచుకోవడం మొదలైన అంశాలపై ప్రతీ నెలా శిక్షణనిస్తారు.

భరోసా కల్పించేందుకే..
కరోనా కాలంలో ఆటోడ్రైవర్లు పడిన ఇబ్బందులు, కుటుంబాల పరిస్థితి విన్నాక వారికి ఆర్థిక, సామాజికంగా భరోసా కల్పించాలని అనుకున్నాం. పరపతి సంఘం ఏర్పాటుచేస్తే తక్కువ వడ్డీ, సులభ వాయిదాలకు రుణాలు వస్తాయి. బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, మూలధనాన్ని వారు సమకూర్చుకోలేని పరిస్థితి. అందుకే నాకు తోచిన, చేతనైన సాయం చేశాను. ఈ సాయంతో ఆటోవాలాలు నిలదొక్కుకుంటే చాలు.
– తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

జీవితాల్లో మార్పులు తేవాలని..
ఆటో కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారి జీవితాల్లో మార్పునకు సంఘం ద్వారా కృషి చేస్తాం. సిద్దిపేట ఆటో కార్మికులంటే ఆదర్శంగా నిలవాలనేది మా ఆలోచన. సంఘం ఏర్పాటుకు మంత్రి హరీశ్‌రావు చేసిన త్యాగం మరువలేం. 
– పాల సాయిరాం, సంఘం అధ్యక్షుడు

చేసిన కష్టం అప్పులకే పోయేది
ఆటో నడిస్తేనే కుటుంబాలు గడుస్తాయి. రిపేర్, కొత్త ఆటోలు కొనుగోలు, ఇంటి ఖర్చులకు అధిక వడ్డీలకు అప్పులు చేసేవాళ్లం. రోజువారీ సంపాదన అప్పులు తీర్చేందుకే సరిపోయేది. మంత్రి హరీశ్‌రావు ఆర్థిక చేయూతతో మా జీవితాలు నిలబడ్డాయి.
– ఎండీ ఉమర్, పరపతి సంఘం సభ్యుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top