అవినీతి పర్వంలో భాగస్వాములుగా ముఖ్యనేత, మంత్రి
ముఖ్యనేతకు తోడుగా ఉంటున్న వ్యక్తి దళారీగా వ్యవహరిస్తున్నాడు
మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీశ్ ఆరోపణలు
ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.1.80 కోట్లు వసూలు
ముఖ్య నేతకు రూ.1.50 కోట్లు, దళారీకి రూ.30 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు అనుమతుల్లో ముఖ్య నేతతో పాటు ఇటీవలి కాలంలో ఆయనకు తోడు, నీడగా ఉంటున్న ఓ వ్యక్తి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్య నేతతో పాటు కేబినెట్ మంత్రి ఒకరు కూడా ఈ అవినీతి పర్వంలో భాగస్వామిగా ఉన్నాడని చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతూ 110 దరఖాస్తులు అందగా, 25 బ్రూవరీలకు అనుమతులు ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఇందులో 21 మైక్రో బ్రూవరీలు ముఖ్యనేత కోటాలో, మరో 4 మంత్రి కోటాలో మంజూరవుతున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల ముఖ్య నేత కుటుంబం వెంట తిరుమలకు వెళ్లిన ఓ వ్యక్తి దళారీగా వ్యవహరిస్తూ మైక్రో బ్రూవరీల దరఖాస్తుదారుల నుంచి వసూళ్లు చేస్తున్నాడని చెప్పారు.
ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి లైసెన్సు ఫీజు కాకుండా రూ.1.80 కోట్లు అక్రమంగా వసూలు చేస్తుండగా అందులో ముఖ్య నేత వాటాగా రూ.1.50 కోట్లు, దళారీ వాటా రూ.30 లక్షల చొప్పున వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. మద్యం దుకాణాలకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన ప్రభుత్వం.. మైక్రో బ్రూవరీల లైసెన్సుల మంజూరులో పారదర్శకత ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.
వాటాల పంపకాల్లో తేడాల వల్లే..
‘రాష్ట్రంలో మద్యం సరఫరా సంస్థలకు 17 నెలలుగా రూ.4,500 కోట్లు పెండింగులో ఉన్నాయి. పెండింగు బకాయిలు ఇవ్వకపోవడంతో మద్యం సరఫరా నిలిపివేస్తామని పలు బహుళ జాతి కంపెనీలు హెచ్చరిస్తూ లేఖలు రాస్తూ ఈ మెయిల్స్ పంపుతున్నాయి. గతంలో మేం రెండు శాతం రాయితీతో పక్షం రోజుల్లోనే బిల్లులు చెల్లించాం. ప్రస్తుతం వాటాల్లో తేడాలు రావడంతో మద్యం సరఫరా కంపెనీల బిల్లులు పెండింగులో పెట్టారు.
గతంలో హాలోగ్రామ్ టెండర్ల వ్యవహారంలో ముఖ్యనేతతో పాటు మంత్రి కుమారుడి నడుమ సాగిన పోరాటం ఒక నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణకు దారి తీసింది..’ అని హరీశ్‌రావు చెప్పారు. మంజీర నదిపై ఉన్న సింగూరు, ఘనపురం ప్రాజెక్టు పరిధిలో మరమ్మతుల పేరిట 70 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారని, కానీ సంగారెడ్డి శివారులోని పదుల సంఖ్యలోని బీరు కంపెనీలకు నిరంతరం నీటి సరఫరా చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రైతులకంటే మద్యం కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోందని విమర్శించారు. గీత కార్మికులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చి ఏడాదిన్నరైనా అమలుకు నోచుకోలేదన్నారు.


