వింగ్స్ ఇండియాలో ప్రత్యేక ఆకర్షణ
సాక్షి, హైదరాబాద్: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న విస్క్ సంస్థ స్వయంచాలకంగా పనిచేసే తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అభివృద్ధి దశలో కీలక ముందడుగు వేసింది. పైలట్ అవసరం లేకుండా ప్రయాణించగల ఈ విమానం పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఎయిర్ ట్యాక్సీ పూర్తిగా అటానమస్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వింగ్స్ ఇండియా–2026లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
15 నిమిషాల టర్న్ అరౌండ్ టైమ్..
విమానంపై అమర్చిన ఆధునిక సెన్సర్లు గాల్లోని ఇతర విమానాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పైలట్ ఉన్నట్లే పరిసరాలను ‘ఎలక్ట్రానిక్ విజన్’ ద్వారా చూసే ఈ సిస్టమ్ ల్యాండింగ్ సమయంలో నేలను సైతం గుర్తించి భద్రంగా దిగేలా చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా మానవ జోక్యం లేకుండానే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ విమానానికి ఉంది.
ఈ స్వయంచాలక టెక్నాలజీ వల్ల ఒకే గగనతలంలో ఎక్కువ విమానాలు ఒకేసారి ప్రయాణించే అవకాశం ఉంటుంది. దాంతో అధిక సంఖ్యలో విమానాలు నిర్వహించవచ్చు. ప్రతి ప్రయాణం అనంతరం కేవలం 15 నిమిషాల టర్న్ అరౌండ్ టైమ్‌తో మళ్లీ సేవలకు సిద్ధం చేయాలన్నది సంస్థ లక్ష్యం.
పూర్తిగా ఎలక్ట్రిక్ శక్తితో పనిచేసే ఈ ఎయిర్ ట్యాక్సీ కోసం వేగవంతమైన చార్జింగ్ టెక్నాలజీని కూడా ‘విస్‌్క’ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా నగరాల మధ్య రోడ్డు ట్రాఫిక్ తగ్గడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వైద్య సరఫరాలు వంటి అత్యవసర సేవలను వేగంగా చేరవేయొచ్చని సంస్థ చెబుతోంది.
‘ఈ దశాబ్దం ముగిసేలోపు అమెరికాలో ఎఫ్‌ఏఏ సర్టిఫికేషన్ పూర్తిచేసి, ముందుగా అమెరికాలో సేవలు ప్రారంభిస్తాం. అనంతరం భారత్ వంటి ఇతర మార్కెట్లకు విస్తరించాలన్నది మా ప్రణాళిక. భారత్‌లో వసతులు అద్భుతంగా ఉన్నాయి.. ఎయిర్ కండిషనింగ్ నుంచి తయారీ ప్రమాణాల వరకు అన్నీ ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ చూసిన కొన్ని ఉత్పత్తులను అమెరికాలోని మా బృందానికి సూచించాలనుకుంటున్నాను’’ అని విస్క్ ఆసియా పసిఫిక్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఫిలిప్ స్విన్స్‌బర్గ్ చెప్పారు.


