ఆస్తులమ్మితే నజరానా ఆఫర్లు దారుణం.. కేంద్రంపై మంత్రి హరీశ్‌ ధ్వజం

Harish Rao Slams Central Government - Sakshi

సిద్దిపేట జోన్‌: ‘కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతోంది.. రైలు, ఎల్‌ఐసీ, విమానాశ్రయాలు.. చివరికి ఆర్టీసీ బస్టాండ్లు కూడా అమ్ముకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది.. పైగా ప్రభుత్వ ఆస్తులను అమ్మితే నజరానా ఇస్తామని కేంద్రం ఆఫర్‌ ఇవ్వడం దారుణం.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించిన ఆధునిక బస్టాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీకి ఏటా రూ.1500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఇటీవల తాను తిరుపతిలో శ్రీవారి దర్శనానికి మూడు గంటల పాటు కాలినడకన వెళ్తుండగా పలువురు భక్తులు పరిచయమయ్యారని హరీశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి వారిని ఆరా తీయగా, తెలంగాణలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధితో సమానంగా నిలబడే స్థాయి తమ రాష్ట్రాలకు లేదని వారు చెప్పారని వివరించారు. కాగా సిద్దిపేట బస్టాండ్‌ నుంచి సికింద్రాబాద్‌కు మంత్రి హరీశ్‌రావు బస్‌ టికెట్లు ఇవ్వగా, ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాల కిషన్‌ కొనుక్కొని అందులో సికింద్రాబాద్‌ వరకు ప్రయాణించారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top